
- లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
- ముంబైలో బిల్డింగ్ కూలి మహిళ మృతి
ముంబై : మహారాష్ట్రను వానలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.రైళ్లు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు నాగ్‌పూర్, చంద్రాపూర్, అమరావతి, వార్దా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో భీవండి ప్రాంతంలో జనజీవనం అతలాకూతలం అయ్యింది. గడ్చిరోలిలోని కొన్ని ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరదల కారణంగా అల్లపల్లి భామ్రాగఢ్ నేషనల్హైవే సహా 8 రోడ్లను మూసేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. నగరంలోని రోడ్లు, రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచి, సబర్బన్ రైలు సర్వీసులు 15 – 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. హార్బర్ లైన్‌లోని చునాభట్టి వద్ద ట్రాక్‌లపై నీరు చేరడంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నీరు చేరడంతో అంధేరి సబ్వేను కొద్దిసేపు మూసివేశారు.
నీటిని బయటకు పంపించి, సేవలను పునరుద్ధరించారు. థానే జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. థానే వందన బస్ డిపో, స్థానిక మార్కెట్‌లో నీరు చేరడంతో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముంబై, పాల్ఘర్కు ఎల్లో అలర్ట్, థానే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
ముంబైలో బిల్డింగ్ కూలి మహిళ మృతి..
ముంబైలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శనివారం ఓ బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. ముగ్గురు గాయపడ్డారు. గ్రాంట్రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల పాత భవనంలో కొంతభాగం కూలిపోగా.. మరికొంత భాగం వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. ఆ సమయంలో ఇంట్లో 30-40 మంది ఉన్నారు. మహిళ మృతదేహాన్ని ఫైర్, పోలీస్ అధికారులు శిథిలాల నుంచి వెలికి తీశారు.
ఒడిశాలోనూ భారీ వానలు
ఒడిశాలోనూ శనివారం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చిలికా సరస్సు సమీపంలో తీరం దాటడంతో వానలు దంచికొట్టాయని అధికారులు తెలిపారు. మల్కాన్‌గిరి జిల్లాలో 23 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు.
నాగ్‌పూర్‌లో స్కూళ్లకు సెలవులు
నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం 135.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయ్యాయి. భారీ వర్ష సూచనలతో నాగ్‌పూర్‌లోని స్కూళ్లకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హుద్కేశ్వర్ నగర్ఏరియాలో వరదలో చిక్కుకున్న 50 మంది అంటాలికా కాలేజీ విద్యార్థులను అధికారులు రక్షించారు.