
- దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు
- కూలిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు
- చెరువుల డ్యామేజీ, కాల్వలకు గండ్లు
- పెద్ద సంఖ్యలో కూలిన ఇండ్లు
- కోట్లాది రూపాయల నష్టం
మెదక్, వెలుగు: భారీ వర్షాలు, వరదలు మెదక్ జిల్లాకు అపార నష్టాన్ని కలిగించాయి. వాన దంచి కొట్టడంతో నదీ, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అనేక రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. వందలాది విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సబ్ స్టేషన్లు డ్యామేజీ అయ్యాయి. మైనర్ ఇరిగేషన్ చెరువుల కట్టలకు, కాల్వలకు గండ్లు పడ్డాయి. వందల సంఖ్యలో ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
విద్యుత్ శాఖకు రూ.9.90 కోట్ల నష్టం
జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలో 1,344 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 51 కిలో మీటర్ల మేర విద్యుత్ సరఫరా లైన్ దెబ్బతింది. 460 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 3 పవర్ ట్రాన్స్ఫార్మర్లు (5 ఎంవీఏ) దెబ్బతిన్నాయి. మెదక్ పట్టణ శివారులోని పిల్లికొటాల్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగి పూర్తిగా దెబ్బతింది. హవేలీ ఘనపూర్, సర్థన విద్యుత్ సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ.9.90 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ట్రాన్స్ కో డీఈ శ్రీనివాస్ తెలిపారు.
68 కిలోమీటర్ల ఆర్అండ్ బీ రోడ్లు డ్యామేజీ
36 ప్రాంతాల్లో 68.50 కిలో మీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 9 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 59 ప్రాంతాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 15 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. డ్యామేజీ అయిన ఆర్అండ్ బీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.4.29 కోట్లు, పర్మనెంట్ గా రోడ్ల బాగు కోసం రూ.76.68 కోట్లు అవసరం అవుతాయని అంచనా.
60 పీఆర్ రోడ్లు డ్యామేజీ
జిల్లా వ్యాప్తంగా 60 పంచాయతీరాజ్రోడ్లు దెబ్బతిన్నాయి. 29 చోట్ల కల్వర్టులు డ్యామేజీ అయ్యాయి. 14 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, పర్మనెంట్ పనుల కోసం రూ.17.11 కోట్లు అవసరం అవుతాయని పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు రూపొందించి పంపామన్నారు.
6,341 ఎకరాల్లో నీట మునిగిన పంటలు
భారీ వర్షాలు వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆయా మండలా పరిధిలో 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ తెలిపారు. హవేలీ ఘనపూర్, మెదక్, చిన్నశంకరంపేట, టేక్మాల్, రామాయంపేట మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని తెలిపారు. ఏఈఓలు క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా సర్వే చేస్తున్నారని అది పూర్తయ్యాక మొత్తం ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి అన్నది తెలుస్తుందన్నారు.
63 చెరువులు డ్యామేజీ
భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా చెరువులు అన్నీ పూర్తిగా నిండి అలుగు పారుతుండగా ఆయా మండలాల పరిధిలో 63 చెరువులు దెబ్బతిన్నాయి. అత్యధికంగా చిన్నశంకరంపేట మండలంలో 10 చెరువులు, శివ్వంపేట మండలంలో 6, కౌడిపల్లి మండలంలో 6, హవేలీ ఘనపూర్ మండలంలో 6 చెరువులు డ్యామేజీ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 36 చెరువులకు గండ్లు పడ్డాయి.
దెబ్బతిన్న 513 ఇండ్లు
భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో మొత్తం 513 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. హవేలీ ఘనపూర్, మెదక్, రామాయంపేట, కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి.
పొలంలో ఇసుక పెట్టింది
నేను ఈ సారి నాలుగు ఎకరాల్లో వరి పంట వేసిన. ఎన్నడు లేని విధంగా బ్రాహ్మండ్ల చెరువు అలుగు పారడంతో మా పొలం ఒడ్లన్నీ కోసుకు పోయి పొలంలో ఇసుక పెట్టింది. దాన్ని పొలం నుంచి తీయాలంటే షానా ఖర్చు అయితది. కొత్తగా వేసిన పైప్ లైన్ కూడా వరదకు ఆగం అయ్యింది. ఇంకో దగ్గర 30 గుంటల వరి పంట మూడు రోజుల నుంచి వరద నీళ్లల్లనే ఉంది. ఈ సారి పెట్టిన పెట్టుబడి కూడా వస్తదో రాదో. - పెద్దబోయిన మహేందర్, రైతు, చల్మెడ
రాకపోకలకు ఇబ్బంది
మా గ్రామం నుంచి ఎటు పోవాలన్నా, ఇతర గ్రామాల నుంచి రావాలన్నా ఇబ్బందిగా ఉంది. రోడ్డు బాగాలేక10 ఏళ్ల నుంచి నరకం చూసాం. వర్షానికి వాగు ప్రవాహం రోడ్డుపై ప్రతిసారి వెళ్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జి కూడా ప్రమాదకరంగా ఉంది. భారీ వర్షానికి రోడ్డంతా గుంతల మయంగా తయారైంది. ఇటీవల మొదలు పెట్టిన రోడ్డు పనులు త్వరగా పూర్తిచేస్తే బాగుంటుంది.- రాజిరెడ్డి, నవాపేట, శివ్వంపేట మండలం