తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  దీని ప్రభావంతో నిన్న(గురువారం) ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఇవాళ్టి(శుక్రవారం) నుంచి సోమవారం వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచే  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అవి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఉభయ వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.