
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో భారీ వర్షం కారణంగా పంట నష్టం పెరిగింది. సిరికొండ, చందూర్, ధర్పల్లి, ఇందల్వాయి, భీంగల్, మోర్తాడ్, మెండోరా, రెంజల్తోపాటు 13 మండలాల్లో 1,026 ఎకరాల పంటలను ఇసుక కప్పేసింది. 48,429 ఎకరాల పంటలు నీటమునిగాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలిపారు.
24,778 మంది రైతులు నష్టాలపాలయ్యారని పేర్కొన్నారు. 185 గ్రామాల్లోని వరి, సోయాబీన్, జొన్న, కూరగాయ పంటలు ధ్వంసమయ్యాయి. మరో రెండు రోజులు అధికారులు ఫీల్డ్ విజిట్స్ చేయనున్నారు. పంట నష్టంపై సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కరెంట్ సప్లై పునరుద్ధరణ చర్యలు..
ధర్పల్లి మండలం హోన్నాజీపేట, వాడి చెరువు కట్టలు ధ్వంసమయ్యాయి. బీరప్పతండా, లక్ష్మీతండా, నడిమితండా, హోన్నాజీపేటలో కరెంట్ సప్లై దెబ్బతింది. ఎన్‌పీడీసీఎల్ ఇంజినీర్లు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 264 విద్యుత్ స్తంభాలు, 92 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. కొత్త వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ కలిపి 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో ధ్వంసమైన రోడ్ల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. తాత్కాలిక రిపేర్ల కోసం కలెక్టర్ ఫండ్ నుంచి రూ. 1.5 కోట్లు కేటాయించనున్నారు.