మొదట్లో ఎండలు.. ఇప్పుడు వానలు..పత్తి రైతులను దెబ్బతీస్తున్న వాతావరణ పరిస్థితులు

మొదట్లో ఎండలు.. ఇప్పుడు వానలు..పత్తి రైతులను దెబ్బతీస్తున్న వాతావరణ పరిస్థితులు
  • సీజన్‌‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వాడిపోయిన మొలకలు
  • ప్రస్తుతం అధిక వర్షాలు, నీటి నిల్వ కారణంగా మొక్కలకు తెగుళ్లు
  • రాలిపోతున్న పూత.. కుళ్లిపోతున్న పిందెలు
  • దిగుబడిపై ప్రభావం చూపుతుందంటున్న రైతులు

మహబూబ్‌‌నగర్/చిన్నచింతకుంట, వెలుగు : ఈ సీజన్‌‌లో పత్తి సాగు మొదలు పెట్టినప్పటి నుంచీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సీజన్‌‌ మొదట్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కలు వాడిపోగా.. ప్రస్తుతం అధిక వర్షాల వల్ల తెగుళ్లు సోకి చేన్లు దెబ్బతింటున్నాయి. రెండు వారాలుగా ఎడతెగని వర్షాలు పడుతుండడంతో పత్తి చేన్లలో నీరు భారీ స్థాయిలో నిలిచిపోతోంది. దీని వల్ల కొన్ని చోట్ల పూత రాలి, పిందెలు కుళ్లిపోతుండగా.. మరికొన్ని చోట్ల తెగుళ్లు సోకుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రోజుల తరబడి చేన్లలో నిలుస్తున్న నీరు

మహబూబ్‌‌నగర్‌‌, నారాయణపేట జిల్లాల్లో వానాకాలం సీజన్‌‌లో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు. ఈ సీజన్‌‌లో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1.57 లక్షల ఎకరాలు, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలో 95 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ రిపోర్టులు చెబుతున్నాయి. కౌకుంట్ల, దేవరకద్ర, చిన్నచింతకుంట, మక్తల్, లింగపల్లి, కర్ని, ఖానాపూర్‌‌, దాదాన్‌‌పల్లి, రుద్రసముద్రం, ఉప్పర్‌‌పల్లి, పస్పుల, మద్దూరు, చెన్నారెడ్డిపల్లి, రేణివట్ల, మోమినాపూర్, పెదిరిపహాడ్, దుప్పట్టిగట్టు, నందిపహాడ్, నర్వ, మరికల్, మాగనూరు, కృష్ణ, ఊట్కూరు, మిడ్జిల్‌‌ ప్రాంతాల్లో పత్తి ఎక్కువగా సాగవుతుంది. 

ఆగస్ట్‌‌ రెండో వారంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం పత్తి పంటపై పడింది. నాలుగు రోజులు రెగ్యులర్‌‌గా వానలు పడడంతో పత్తి చేన్లలో నీరు నిలిచిపోయింది. సీజన్‌‌ మొదట్లో సాగైన పత్తి ప్రస్తుతం పిందె దశలో ఉండగా.. ఆలస్యంగా సాగైన పత్తి పూత దశలో ఉంది. ఇటీవల కురుస్తున్న వానలతో పిందెలు కుళ్లిపోతుండగా, పూత రాలిపోతోంది. చేన్లలో రోజుల తరబడి నీరు నిల్వ ఉంటుండడం వల్ల మొక్కలు కొన్ని చోట్ల నల్లగా, మరికొన్ని చోట్ల ఎర్రగా మారుతున్నాయి.

సీజన్‌‌ మొదటి నుంచీ ఇబ్బందులే..

ఈ వానాకాలం సీజన్‌‌లో రోహిణి కార్తెలోనే రైతులు వేసవి దుక్కులు పూర్తి చేసుకొని పత్తి విత్తనాలు చల్లుకున్నారు. జూన్‌‌ మొదటి వారంలోనే నైరుతి  రుతుపవనాలు రాగా.. రెండు, మూడు రోజుల పాటు జల్లులు పడ్డాయి. ఆ తర్వాత వానలు ముఖం చాటేశాయి. మృగశిర కార్తె పోయినా వర్షాల జాడలేదు. జూన్‌‌  పోయి జులై వచ్చినా వర్షాలు పడకపోవడంతో ఆశించిన స్థాయిలో పత్తి మొలకలు రాలేదు. దీంతో రైతులు తిరిగి రెండోసారి విత్తనాలు వేశారు. 

డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని నీటి తడులు అందించారు. కొందరు రైతులు బిందెల ద్వారా  మొక్క మొక్కకూ నీటిని అందించి వాటిని కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటలు దెబ్బతింటున్నాయి. చేలలోకి నీరు చేరుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితోంది. దీని ప్రభావం దిగుబడులపై పడే అవకాశం ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి 

ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి చేనుకు తెగుళ్లు సోకుతున్నాయి. చేన్లలో నీరు నిల్వ ఉండడం వల్ల మొక్కకు సరైన పోషకాలు అందడం లేదు. ఈ సమస్య మొక్క అడుగు భాగంలో ఉంటే అది మెగ్నీషియం లోపంగా గుర్తించొచ్చు. బోరాన్‌‌ లోపం కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు మెగ్నీషియం సల్ఫేట్‌‌ స్ర్పే చేసుకోవాలి.- రాజేశ్‌‌ ఖన్నా, ఏవో, చిన్నచింతకుంట

నివారణ చర్యలు

నల్లరేగడి చేన్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల వేరుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉండకుండా బోదెలు తీసి నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపాలి. వేరుకుళ్లు నివారణకు వర్షాలు ఆగిన తర్వాత కాపరాసిక్స్‌‌ క్లోరైడ్‌‌ మందును అందించాలి. దీనిని స్ర్పే చేయకుండా ఏ మొక్కకు అయితే తెగులు సోకిందో ఆ మొక్కకు మాత్రమే జగ్గుతో నీటిని పోయాలి. 
    
చెల్క నేలల్లోని పత్తి చేన్లకు తెల్ల దోమ సోకుతోంది. ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్రోపిడ్‌‌ మందును పిచికారి చేయాలి. ఎకరాకు 400 ఎంఎల్‌‌ మందును నీటిలో కలిపి స్ర్పే చేసుకోవాలి. 
    
వానల కారణంకా పత్తి చేన్లలో నీరు నిల్వ ఉండడం వల్ల పారా విల్ట్‌‌ తెగులు సైతం సోకుతుంది. ఈ తెగులు సోకితే మొక్కలు వడలిపోయి తర్వాత ఎర్రగా మారి ఎండిపోతాయి. దీని నివారణకు ముందుగా చేనుల్లో నిలిచిన మురుగు నీటిని బయటకు పంపించాలి. వర్షాలు ఆగిన తర్వాత కాపర్‌‌ ఆక్సిక్లోరైడ్‌‌ మూడు గ్రాములను మొక్కల మొదళ్లు తడిసేలా స్ర్పే చేయాలి.