
- పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపిన అధికారులు
- పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్న రైతులు
మెదక్/సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల అన్నదాతలకు తీరని నష్టం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,906 రైతులకు సంబంధించి 5,556 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెరువులు నిండి అలుగులు పారడం, పంట కాలువలు, కట్ట కాలువలు తెగడం, వాగులు ఉధృతంగా ప్రవహించడం వల్ల వరి, పత్తి, మొక్కొజొన్న, మినుము, పెసర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.
మెదక్ జిల్లాలో..
నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలోని 8 మండలాల్లో 2,218 మంది రైతులకు సంబంధించి 1,553 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. టేక్మాల్, రేగోడ్, అల్లదుర్గం, పాపన్నపేట, కౌడిపల్లి, పెద్ద శంకరంపేట, చిలప్ చెడ్, శివ్వంపేట మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర పంటలు నీట మునగగా, అత్యధికంగా టేక్మాల్ మండలంలో 635 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
పంటల వారీగా చూస్తే జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో 1,184 మంది రైతులకు సంబంధించి 874 ఎకరాల్లో వరి పంట, 855 మంది రైతులకు సంబంధించి 549 ఎకరాల్లో పత్తి పంట, 79 మంది రైతులకు సంబంధించి 52 ఎకరాల్లో మినుము పంట, 100 మంది రైతులకు సంబంధించి 78 ఎకరాల్లో పెసర పంట దెబ్బతింది.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాల పరిధిలో 3,803 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్గల్, మర్కూక్ మండలాల పరిధిలో 1,038 మంది రైతులకు సంబంధించి 3,553 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.. ఇందులో 18 గ్రామాల పరిధిలో 163 మంది రైతులకు సంబంధించి 261 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. మొక్కజొన్న 16 గ్రామాల పరిధిలో 51 రైతులకు సంబంధించి 81 ఎకరాలు దెబ్బతింది. 18 గ్రామాల పరిధిలో 87 మంది రైతులకు సంబంధించిన 129 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 26 మండలాల్లో ఇప్పటివరకు 9 మండలాల పరిధిలో పంటలు దెబ్బతిన్నాయి. 650 మంది రైతులకు సంబంధించి 450 ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంగ్టి, పుల్కల్, మునిపల్లి, కోహీర్, ఝరాసంఘం, రాయికోడ్, న్యాల్కల్, నారాయణఖేడ్, నిజాంపేట మండలాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి, మినుము, పెసర, కంది పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.