
మెదక్ /నిజాంపేట, వెలుగు: జిల్లాలో పత్తి రైతులకు పెద్ద ఆపతి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి కాయలు నల్లగా మారడంతో దిగుబడి తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు ఆనందంగా పత్తి విత్తనాలు విత్తారు. కానీ తర్వాత ఎండల కారణంగా విత్తనాలు సరిగ్గా మొలవక రెండోసారి విత్తనాలు వేశారు. పత్తి సాగులో చేయాల్సిన అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను చిత్తు చేశాయి.
34,751 ఎకరాల్లో..
జిల్లాలో ఈ వానాకాలంలో నిజాంపేట, రామాయంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్, టేక్మాల్, రేగోడ్, అల్లా దుర్గం, పెద్దశంకరంపేట తదితర మండలాల్లో 34,751 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. కానీ భారీ వర్షాల కారణంగా కాయ మొత్తం కుళ్లిపోయింది. మొదట వచ్చిన పంటనే అధిక బరువు వస్తోందని, రెండో విడత అంత బరువు రాదని రైతులు చెబుతున్నారు. ఎకరాకు రూ.60 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు ఆ పెట్టుబడి ఖర్చులు కూడా వస్తాయో రావోనని దిగులు చెందుతున్నారు.
భారీ వర్షాల కారణంగా..
సాధారణ పరిస్థితుల్లో నల్లరేగడి నేలల్లో నే పత్తి పంట అధిక దిగుబడి వస్తోంది. కానీ భారీ వర్షాల కారణంగా ఈ నేలలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల పత్తి చేన్లు అన్నీ దెబ్బతిన్నాయి. పంట ఎదగని పరిస్థితి నెలకొంది. కలుపు తీయడం కష్టమవుతోంది. ఎడతెగని వర్షాలతో ఓ వైపు పంట ఎర్రబడిపోవడం, మరోవైపు కలుపు సమస్య తీవ్రమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెగని వర్షాలతో పత్తి ఎర్రబడడం, పత్తి కాయలు నల్లబడి పంట ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో దిగుబడి తగ్గుతోందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.
నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి
పత్తి సాగు చేస్తున్న రైతులు చేలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పత్తి చేను అధిక వర్షాలను తట్టుకోలేదు. గత నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. చేనులో వర్షపు నీరు నిల్వ ఉంటే కాయ నల్లగా మారుతుంది.
ఇలాంటప్పుడు 500 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 100 గ్రాముల ప్లాంటో మైసిన్, 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి. ఇలా చేసిన రెండు రోజుల తర్వాత ఆగ్రో మాక్స్ 2.5 గ్రాములు, 5 గ్రాముల 19:19:19 ను లీటర్ నీటికి కలిపి చేనులో స్ప్రే చేయాలి.సోమ లింగారెడ్డి, ఏవో, నిజాంపేట
ఆరెకరాల చేను దెబ్బతింది
నేను పోయినేడు రెండెకరాల్లో పత్తి ఏసినా. అప్పుడు దిగుబడి మంచిగా వచ్చిందని ఈసారి ఆరెకరాల్లో పత్తి ఏసినా. మొదట్లో వానలు పడక మొక్కలు సరిగ్గా మొలవలే. రెండోపారి మళ్లీ ఇత్తనాలు పెట్టినా. ఎకరాకు రూ.30 వేల దాకా ఖర్చయినయ్. కానీ మొన్నటిదాకా పడ్డ వానలకు చేను మొత్తం పాడైంది. మొదటి కాయ నల్లగా మారి కరాబ్ అయింది. పెట్టుబడి కూడా వస్తదో రాదో జర సర్కార్ గుర్తించి సాయం చేయాలి.కుర్మ రాజు, రైతు, చల్మెడ, నిజాంపేట