భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మృతి

భారీ వర్షాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మృతి

పదుల సంఖ్యలో గల్లంతు..

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మందికిపైగా మృతి చెందారు. ఇంకా పదుల సంఖ్యల వ్యక్తుల ఆచూకీ దొరకడంలేదు. ఒక్క హైదరాబాద్ లోనే 29 మంది చనిపోయారు. హైదరాబాద్ లష్కర్ గూడలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గల్లంతయ్యారు. అందులో ఒకరి డెడ్​బాడీ దొరికింది. గగన్ పహాడ్ వద్ద అప్పా చెరువు కట్ట తెగిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. భూదాన్​ పోచం పల్లి వద్ద దగ్గర ఇద్దరు బాలికల ఆచూకీ దొరకడం లేదు. బంజారాహిల్స్​ ఎస్ బీహెచ్ కాలనీలోని యోగా క్లినిక్ లో చేరిన వాన నీళ్లు తోడేసేందుకు మోటార్ వేయడానికి వెళ్లిన డాక్టర్ సతీష్ రెడ్డి కరెంట్ షాక్ తో మృతి చెందారు. అంబర్ పేట్ లోనూ మరొకరు కరెంట్ షాక్ తో చనిపోయారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న నాగోల్ కు చెందిన సుందర్ రాజు అనే పోస్టు మాస్టర్ గల్లంతయ్యారు. శంషాబాద్​ పరిధిలోని సుల్తాన్​పల్లికి చెందిన నరసింహ (45) చేపలు పట్టడానికని వెళ్లి నీటిలో కొట్టుకుపోయాడు. ఇక జిల్లాల్లో ఇండ్లు కూలి, వరదలో కొట్టుకుపోయి తొమ్మిది మంది చనిపోయారు. నాగర్ కర్నూల్​ జిల్లా కుమ్మెర గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన హన్మంత్ రెడ్డి (70), అనసూయమ్మ(50), హర్షవర్ధన్ రెడ్డి(12) చనిపోయారు. ఇదే ఘటనలో గాయపడిన మరో ఇద్దరికి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయి నలుగురు చనిపోయారు. వీరిలో పోచంపల్లి మండలానికి చెందిన మైసమ్మ (40), పాలిటెక్నిక్​ స్టూడెంట్​ వైష్ణవి (18), వలిగొండ మండలం వెల్దుర్తికి చెందిన మారేపల్లి యాదగిరి (65), ఖమ్మం జిల్లాకు చెందిన భరత్ (35) ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రాతోని చెరువు అలుగులో మంగళవారం కొట్టుకుపోయిన మల్లెల రవి డెడ్​బాడీని బుధవారం గుర్తించారు. యాద్రాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో కల్వర్టులో పడి కార్తిక్ శర్మ (11) చనిపోయాడు.