V6 News

అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ సింగరేణి జట్టు విజయం

అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ సింగరేణి జట్టు విజయం

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచులో అపర్ణ మెస్సీ టీమ్‌పై సీఎం రేవంత్ నేతృత్వంలోని సింగరేణి టీమ్‌ విజయం సాధించింది. మెస్సీ అపర్ణ జట్టు రన్నరప్‎గా నిలిచింది. ఫుట్‎బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ విన్నర్, రన్నరప్ జట్లకు కప్‏లు అందించారు. 

కాగా, గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) మెస్సీ హైదరాబాద్‎కు వచ్చారు. కోల్‎కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ భారీ బందోబస్తు నడుమ విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‏కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‎లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 

ఆ తర్వాత ఫలక్ నుమా ప్యాలెస్‎లో నిర్వహించిన ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మీట్ అండ్ గ్రీట్‎లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. 

మెస్సీ అపర్ణ, రేవంత్ సింగరేణి జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచును తిలకించారు. మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్‎లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చి రాగానే గోల్ కొట్టి అలరించారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‎లో కూడా గోల్ కొట్టారు. పెనాల్టీ షూటౌట్‎లో మెస్సీ కూడా రెండు గోల్స్ కొట్టి అలరించారు. మ్యాచ్ ముగిశాక గ్రౌండ్ లోకి దిగిన మెస్సీ సీఎం రేవంత్ తో పాటు ఆటగాళ్లతో సరదాగా కాసేపు ఆట ఆడారు. సీఎం రేవంత్  తన మనువడిని గ్రౌండ్‎లోకి తీసుకొచ్చి మెస్సీకి పరిచయం చేశారు. 

రేవంత్ మనువడితో మెస్సీ కాసేపు ఫుట్‏బాల్ ఆడారు. అనంతరం తన మనువడితో కలిసి సీఎం రేవంత్ మెస్సీతో ఫొటో దిగారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మ్యాచ్ అనంతరం అతడితో కలిసి ఫొటో దిగారు. ఇక, తన కోసం వచ్చిన ప్రేక్షకులకు స్టేడియం చుట్టూ తిరుగుతూ మెస్సీ అభివాదం చేశారు. దీంతో ఉప్పల్ స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మోరుమోగిపోయింది. మొత్తానికి మెస్సీ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది.