ఎడతెరిపి లేని వాన..నీటమునిగిన కాలనీలు

ఎడతెరిపి లేని వాన..నీటమునిగిన కాలనీలు

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

అర్ధరాత్రి సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఒంటి గంటకు ప్రాంభమైన వర్షం..తెల్లవారుజామున 4 గంటల వరకు కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఓల్డ్ సిటీ, కోఠీ, అబిడ్స్, మలక్ పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, కాప్రా, కూకట్ పల్లి, కుషాయిగూడ, రాయదుర్గం,  హిమాయత్ నగర్ లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. చార్మినార్, పాతబస్తీ, యాకుత్ పురా, మాదన్నపేట, మొగల్ పూర్, శాలిబండ, బహదూర్ పురా, ఎల్బీనగర్ లో వర్షం దంచికొట్టింది. 

ఇళ్లలోకి చేరిన నీరు..ప్రజల ఇబ్బందులు

రాత్రి కురిసిన భారీవర్షానికి...వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. చాలా చోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు ప్రవహించింది. రాత్రి భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడిపారు. కోఠిలో ఓ బైక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. మలక్ పేట్ బ్రిడ్జ్ దగ్గర నడుములోతు వరకు నీరు ప్రవహించటంతో చాలా సేపు రాకపోకలు స్తంభించాయి. నాగోల్ డివిజన్ అయ్యప్ప నగర్ కాలనీలో ఇండ్లలోకి వరదనీరు చేరింది. 

వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి.  వాగులు, చెరువులు పొంగుపొర్లుతున్నాయి.  కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారుతుండడంతో ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి నీరు పారుతుండగా తాండూరు--హైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు వాగులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనంద్..అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 

గండిపేట జలాశయానికి వరద ఉధృతి

రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

మరో మూడ్రోజులు వానలు

కాగా  రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం  తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాతి రెండ్రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.