
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు రోజులు బ్రేక్ తీసుకున్న వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. కొన్ని రోజుల నుంచి పొడిగా ఉన్న వాతావరణం మంగళవారం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం తెలంగాణపైనా పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మబ్బులు కమ్మేసి ముసురు పట్టింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో సడన్‌గా కుండపోత వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రమంతటా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు బుధవారం ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కాగా, మంగళవారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లిలో 3.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మలిచెలమలో 3.3, ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో 3.2, వికారాబాద్ జిల్లా బంట్వారంలో 3.2, ములుగు జిల్లా వెంకటాపురంలో 3.2, ఖమ్మం జిల్లా పంగిడిలో 3.2, వరంగల్ జిల్లా కల్లెడలో 3.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.