తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం గండం పొంచి ఉంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే.. దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత తగ్గింది. పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. ఎండలు కూడా అధికంగా ఉండడంతో ఉక్కపోత నెలకొంది. హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షం ప్రతి రోజు కురుస్తూనే ఉంది. నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి,హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.