
- నీట మునిగిన బస్తీలు.. రోడ్లపై భారీగా వరద.. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు
- బుధవారం రాత్రి కురిసిన వానకు కోలుకోకముందే గురువారం కుండపోత
- చెరువులను తలపించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు
- బల్కంపేటలో వరదకు కొట్టుకుపోయి యువకుడు మృతి
- సహాయక చర్యల్లో నిమగ్నమైన హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సిటీ అతలాకుతలమైంది. బుధవారం రాత్రి ముషీరాబాద్‌లో 18 సెంటీ మీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా.. మళ్లీ గురువారం కుండపోత వాన పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బహదూర్‌పురాలో అత్యధికంగా 8.65 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం మధ్యాహ్నం దాకా వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికే ఇండ్లలోకి చేరిన నీళ్లు అలాగే ఉన్నాయి. మళ్లీ వాన దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పలు కాలనీలు, బస్తీలు చెరువులను తలపించాయి. ప్రతీచోట మెయిన్రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిల్వడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బాగ్ లింగంపల్లి శ్రీరామ్ నగర్ బస్తీలో ఇండ్లల్లోకి నీళ్లు చేరాయి. అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడారు. అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ, హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న దోమలగూడ, గగన్ మహల్ కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. హైదరాబాద్ సిటీలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
షేక్ పేట్ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద
గురువారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌గా స్తంభించిపోయింది. షేక్ పేట్ ఫ్లై ఓవర్ పై నీళ్లు చేరడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద నీరు జమ కావడంతో తాజ్ కృష్ణ వరకు ట్రాఫిక్ స్తంభించింది పోయింది. సెక్రటేరియెట్ సిగ్నల్ వద్ద మెకాళ్లలోతు నీళ్లు చేరాయి. హెచ్ సీయూ వద్ద భారీగా వరద నీరు చేరడంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి వద్ద కూడా ఫ్లైఓవర్ కింద నీరు చేరడంతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్వద్ద రోడ్డుపై నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పంజాగుట్ట, బేగంపేట్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కోఠితో పాటు చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
నీట మునిగిన బాలంరాయ్ వాటర్ పంప్ హౌస్
గురువారం వర్షానికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజ్ భవన్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. బైక్‌లు, కార్లు నీట మునిగాయి. బుధవారం రాత్రి వర్షంతో ఎస్‌ఆర్ నగర్ కమిటీ హాల్ రోడ్డులో చెట్టు కూలింది. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. బాలంరాయ్ వాటర్ పంప్ హౌస్ లోకి వరదనీరు చేరింది. దీంతో మోటార్లు పనిచేయలేదు. రెండు రోజుల పాటు కంటోన్మెంట్ ఏరియాల్లో వాటర్ సప్లై ఉండదని కంటోన్మెంట్ వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచి బేగంపేట ప్యాట్నీ కాలనీల్లో నీళ్లు నిలిచిపోయాయి. వనస్థలిపురం పనామా వద్ద విజయవాడ హైవేపై గుంతలు ఏర్పడ్డాయి. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ లో పలు కాలనీల్లోని సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. నిజాంపేట్ కార్పొరేషన్ లో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
72 కిలో మీటర్ల దూరంలో అర్జున్ డెడ్‌బాడీ
హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన అర్జున్ డెడ్‌బాడీ గురువారం యాదాద్రి జిల్లా వలిగొండలో లభ్యమైంది. ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి పెద్దఎత్తున వరద నీరు చేరింది. ఆ టైమ్‌లో నాంపల్లిలోని నాలాలో అర్జున్(24), రామ అనే ఇద్దరు, ముషీరాబాద్‌లోని వినోభా నగర్ నాలాలో దినేశ్ అనే మరో యువకుడు గల్లంతయ్యారు. వీరి కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా స్టాఫ్‌తో మూసీ వెంట గత 5 రోజులుగా గాలిస్తున్నారు. అయితే, సిటీ నుంచి 72 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి జిల్లా వలిగొండలోని భీమలింగం కత్వ వద్ద గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న ఒకరి మృతదేహం గురువారం లభ్యమైంది. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన పోలీసులు.. మృతదేహంపై ఉన్న టాటూల ఆధారంగా డెడ్‌బాడీ అర్జున్దిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అర్జున్ మృతదేహాన్ని రామన్నపేట హాస్పిటల్‌కు తరలించారు. కాగా, దినేశ్, రామ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతున్నది.
బల్కంపేట బ్రిడ్జి వద్దనీట మునిగి యువకుడు మృతి
-బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరదలో చిక్కుకుని ఓ యువకుడు చనిపోయాడు. మృతుడిని ముషీరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్(27)గా గుర్తించారు. బుధవారం రాత్రి 11 గంటలకు బైక్ పై బల్కంపేట్ వైపు నుంచి బేగంపేట వైపు వెళ్తున్నాడు. బల్కంపేట్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో బైక్ తో సహా కొట్టుకుపోయాడు. కాలనీవాసులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. తాళ్లతో కట్టి డెడ్‌బాడీని బయటకు లాగారు.
హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద
కుండపోత వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద చేరుతున్నది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరద వస్తున్నది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.94 మీటర్లు ఉంది. వాటర్ లెవెల్‌ను జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తూముల ద్వారా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3,320 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,790 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నది.