హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం  పడుతోంది. తెల్ల వారుజాము నుంచే వర్షం కురుస్తోంది.  జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, అమీర్ పేటర్ ,యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, నేరెడ్ పెట్, కుత్బుల్లాపూర్,  ముషిరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్,  ఉప్పల్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి ,పాతబస్తీ , రాజేంద్ర నగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, ఏరియాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.  పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. 
రెండు రోజులపాటు వర్షాలు

 మంచిర్యాల జిల్లాలో 4.1 సెంటీమీటర్లు

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​లో 2.9, నల్గొండ జిల్లా చింతపల్లిలో 2.2, మహబూబ్ నగర్​ జిల్లా అడ్డకల్​లో 1.9, నాగర్​కర్నూల్​ జిల్లా పాలెంలో 1.7, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా కొండాపూర్​లో 1.2 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. 

కరీంనగర్​లో 45.1 డిగ్రీలు

రాష్ట్రంలో వర్షాలతో పాటు కొన్నిచోట్ల ఎండలు కూడా దంచికొట్టాయి. కరీంనగర్​ కలెక్టరేట్​ వద్ద అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం, నిర్మల్​ జిల్లా లింగాపూర్​లో 44.9 డిగ్రీలు, ఆదిలాబాద్​ జిల్లా చాప్రాల, మంచిర్యాల జిల్లా కొమ్మెరల్లో 44.8, వీణవంకలో 44.6, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్తాన్​పేట, కామారెడ్డి జిల్లా సర్వాపూర్, ఆదిలాబాద్​ జిల్లా అర్లిటిలో 44.5, సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 44.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. హైదరాబాద్​ గచ్చిబౌలిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండల తీవ్రత దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే, రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.