Rain alert: రాగల మూడు గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం

Rain alert: రాగల మూడు గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం

గత కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. శనివారం నాటి ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి పశ్చిమ విదర్భ వరకు.. ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున్న కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే రెండు రోజులు అక్కడక్కడ ఉరిములు మెరుపులతో కూరిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 19న రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులు, ఈదురు గాలుల ( గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మి )తో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రాగల మూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నార్త్ హైదరాబాద్ ఏరియాల్లో వర్షం మొదలైంది..ముఖ్యంగా పటాన్ చెరువు, అమీన్ పూర్, బాచుపల్లి, కొంపల్లి, కండ్లకొయ్య, మేడ్చల్, గండి మైసమ్మ, దుండిగల్ లో వర్షం పడుతోంది. రానున్న గంట, రెండు గంటల్లో అన్ని ప్రాంతాలకు వాన విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.