
గ్యాప్ లేకుండా వర్షం.. వరద కాలువలుగా సిటీ రోడ్లు
ఇంకో మూడ్రోజులూ భారీ వానలు
మూడ్రోలుగా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుండటంతో ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో జనజీవనం స్థంభించింది. దాకా సిటీలోని డౌన్ ఏరియాలన్నీ ఛాతిలోతు వరద నీటిలో మునిగిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున కొద్ది గంటల వ్యవధిలోనే 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లకూ వరద పోటెత్తడంతో ఫ్లైట్, ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలద్ ఏరియాలో గుడిసెలపై గోడ కూలడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వర్షం మొదలైనప్పటి నుంచి బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాల్లో రెస్క్యూ చేపట్టారు. సోమవారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్డీఆర్ఎఫ్) బృందాలు వారికి తోడయ్యాయి. మంగళవారానికి ముంపు ప్రాంతాలు పెరిగిపోవడంతో నేవీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంబై సిటీలో సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ముంబైలోని ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్‌రూమ్‌లో వరదలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సిటీలో రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మలద్‌లో మహావిషాదం
వర్షం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నార్త్ముంబైలోని మలద్ స్లమ్ ఏరియాలో భారీ గోడ కూలి 21మంది బలయ్యాయి. మరో 100 మంది గాయపడ్డారు. ఓ స్కూల్ ప్రహారీని ఆనుకుని గుడిసెలు వేసుకున్న వాళ్లంతా పనిచేస్తేగానీ పూటగడవని కూలీలు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారే గోడ కూలి గుడిసెలపై పడింది. శిధిలాల కింద చిక్కుకుపోయిన పదేండ్ల చిన్నారిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. గాయపడ్డవాళ్లను స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించారు. మలద్ విషాదంపై సంతాపం ప్రకటించిన సీఎం ఫడ్నవిస్.. మృతుల కుటుంబాలకు తలా రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. ఈ ఘటనపై హైలెవల్ఎంక్వైరీకీ ఆదేశించారు. కాగా, మలద్‌లో గోడ కూలిపోయే ప్రమాదముందని ముందే తెలిసినా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ ఆరోపించాయి. బీజేపీ–శివసేన పాలనలో సాగుతున్న స్లమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని, తరచూ భారీ ప్రమాదాలు జరుగుతుండటమే అందుకు నిదర్శనమని ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే అన్నారు. ముంబైలాగే పుణె, థానే సిటీల్లోనూ గోడలు కూలిన ఘటనల్లో మరో 10మంది చనిపోయారు. గత శనివారం పుణెలోలోని కొంధ్వా ఏరియాలో గోడ కూలి 17 మంది ప్రాణాలుకోల్పోయిన సంగతి తెలిసిందే.
ముంబైకర్ల స్పిరిట్
‘నాకెందుకులే..’ అనుకునే ధోరణి నుంచి పక్కకొచ్చి ముంబై వాసులు ప్రదర్శించిన స్ఫూర్తి ప్రశంసలు అందుకుంటోంది. ఎడతెరపిలేని వర్షం, వరదల కారణంగా ఇండ్లకు చేరుకోలేక జనం ఎక్కడిక్కడే చిక్కుకుపోయారు. అలా మధ్యలో ఆగిపోయిన అపరిచితులను స్థానికులు తమ ఇండ్లలోకి ఆహ్వానించారు. సోషల్ మీడియాలోనూ హెల్పింగ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. ‘‘ఈ ఏరియాలో ఎవరికైనా సాయం కావాలంటే మా అడ్రస్‌కి రండి” తరహా మెసేజ్‌లు వరదలాపారాయి. ప్రభుత్వ టీమ్‌లకు దీటుగా స్థానికులు రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాలుపంచుకుంటున్నారు.
‘న్యూస్ పేపర్’ హీరోలకు హ్యాట్సాఫ్: ఆనంద్ మహీంద్ర
తన ట్వీట్స్‌లో తరచూ అన్సంగ్ హీరోల్ని ప్రస్తావించే మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా ఈసారి న్యూస్ పేపర్ సేవల్ని కొనియాడారు. మంగళవారం ఉదయం తన ఇంట్లోని టేబుల్‌పై న్యూస్ పేపర్ ఫొటోను ట్వీట్ చేసి ఆయన.. ‘‘ముంబైలో ఎయిర్పోర్ట్ రన్‌వే, రైల్వే స్టేషన్లు వరదలో మునిగిపోయాయి. స్కూళ్లు బందయ్యాయి. ఇంతజరిగినా న్యూస్ పేపర్ మాత్రం టైమ్‌కి ఇంటికొచ్చింది.. అదికూడా తడవకుండా! ‘అన్ని రోజుల్లాగే ఇవాళ కూడా’ అని అందరూ ఫీలయ్యేలా, భారీ వర్షాన్ని సైతం ఎదిరించి సేవలందిస్తోన్న తెరవెనుక హీరోలకు సెల్యూట్ చెయ్యాల్సిందే’’అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ ఇంటర్నెట్లో వైరల్ అయింది.