
రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత 24 గంటల్లో పాల్ గరలో ఏరియాలో 36 సెంటిమీటర్ల వర్షం కురిసింది. తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో .. గంటలోనే ఏకంగా 10 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో వరద పోటెత్తింది. పాల్ గర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి.
మ్యాన్ హోల్స్ పొంగడంతో నీరంతా రోడ్డు పైకి చేరింది. సియోన్ సర్కిల్, గాంధీ మార్కెట్ , దాదర్, శాంతా క్రజ్ ప్రాంతాలు చెరువులుగా కనిపిస్తున్నాయి. నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సియోన్- మతుంగా రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపైకి నీరు చేరింది. వరదతో 15 రైలు సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలకు.. చాలా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. వర్షపు నీరు ఊళ్లల్లోకి వచ్చి చేరడంతో .. మోకాళ్ల లోతు నీటిలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.