
నివార్ తుఫాన్ దాటికి ఏపీలోని చిత్తూరు, నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు మృతిచెందారు. తుఫాన్ తీరం దాటినా ఈదురు గాలుల భీభత్సం కొనసాగుతూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెలరోజులగా కొనసాగుతున్న వర్షాలకు నిండు కుండలుగా ఉన్న చెరువులు రిజర్వాయరులు కుంభవృష్టితో ప్రమాద స్థితికి చేరాయి. భారీ గాలులకు చెట్లు నేల కూలాయి. తీరంలోని 12 మండలాల్లో సహయక బృందాల చర్యలు కొనసాగుతున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లిన 600 మంది తమిళనాడు మత్స్య కారులు క్రిష్ణపట్నం పోర్టు నుంచి సహాయక శిభిరాలకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు సహాయ చర్యలకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను యుద్ద ప్రాతిపాదికన తొలగించారు. తీర ప్రాంతాల వారిని ముందస్తుగానే తుఫాన్ షెల్టర్ లకు తరలించారు.