
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ వింజో, నజారా టెక్నాలజీస్ ఆధ్వర్యంలో పనిచేసే మూన్‌షైన్ టెక్నాలజీస్ (పోకర్‌బాజీ) తమ రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు శుక్రవారం (ఆగస్టు 22) ప్రకటించాయి. పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025 ఆమోదం పొందడంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.
'ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025' అన్ని రకాల రియల్ మనీ ఆన్‌లైన్ గేమ్‌లను పూర్తిగా నిషేధించింది. ఈ–-స్పోర్ట్స్‌తోపాటు ఉచితంగా ఆడే సోషల్ గేమ్‌లను మాత్రం ప్రోత్సహిస్తుంది. తన అనుబంధ సంస్థ మూన్‌షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త చట్టానికి అనుగుణంగా రియల్ మనీ గేమింగ్ సేవలను నిలిపివేసిందని నజారా టెక్నాలజీస్ తెలిపింది. వందకు పైగా రియల్ మనీ గేమ్‌లను కలిగి ఉన్న వింజో, తమ సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో రమ్మీ, సాలిటైర్, దేహ్లా పకడ్, ఫాంటసీ క్రికెట్, పోకర్ లాంటివి ఉన్నాయి. భారతదేశంలో తమ రియల్ మనీ గేమింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు లింక్‌డిన్ పోస్ట్‌లో ఎంపీఎల్ వెల్లడించింది. కొత్త డిపాజిట్‌లు తీసుకోమని, కస్టమర్లు తమ బ్యాలెన్స్‌లను విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. పేమెంట్ గేమ్‌లను నిలిపివేసినట్లు జూపీ కూడా ప్రకటించింది. ఉచిత గేమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది.