
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. 2024, జూన్ 11వ తేదీ మంగళవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, అల్వాల్, కంటోన్మెంట్, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మాదాపూర్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్ , నారాయణగూడ, కాంచన్ బాగ్, అలియబాద్, సంతోష్ నగర్, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్ నుమా, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లితోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లపై వరద నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మల్లికార్జున్ నగర్ మల్లికార్జున నగర్, అశోక్ నగర్ ప్రాంతాలలో వర్షానికి కాలనీ రోడ్లు జలమాయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ప్రాంతంలో వర్షం కురిసి తగ్గడంతో ఒకేసారి రోడ్లపైకి వచ్చిన వాహనాలతో వరంగల్ టూ మేడిపల్లి, ఉప్పల్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.