ముంబైలో కుండపోత వానలు.. మనోళ్లు ఉంటే.. బయట అడుగుపెట్టొద్దని చెప్పండి..!

ముంబైలో కుండపోత వానలు.. మనోళ్లు ఉంటే.. బయట అడుగుపెట్టొద్దని చెప్పండి..!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని కుండపోత వాన తడిపి ముద్ద చేసింది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా మోకాలి లోతు నీళ్లు. పట్టాలు మునిగిపోయి లోకల్ ట్రైన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చే అవకాశం లేక సోమవారం సెలవు ప్రకటించారు. ముంబైకి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు. గడచిన 8 గంటల్లో ముంబై సిటీలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత రెండు రోజుల నుంచి మహారాష్ట్రను వానలు ముంచెత్తుతున్నాయి. ముంబై సిటీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది.

ముంబైలోని లోతట్టు ప్రాంతాలైన సియోన్, బాంద్రా, అంధేరి మునిగిపోయాయి. ముంబైలో 48 గంటలుగా కురుస్తున్న వర్షాలకు నగరం మొత్తం మీద 333 పాత్ హోల్స్ బయటపడ్డాయి. ముంబైలోని మతుంగ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్ వరద నీళ్లలో చిక్కుకుపోయింది. దాదాపు అర గంట పాటు వరదలోనే ఉండిపోవాల్సి రావడంతో రెస్క్యూ టీమ్స్ స్కూల్ బస్సులో నుంచి పిల్లలను క్షేమంగా బయటకు చేర్చారు. సిటీలో చాలా చోట్ల రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. పాదచారులు మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లారు.

రైల్వే లైన్లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎడతెరిపిలేని వానలతో ప్రజారవాణా స్తంభించింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. విమానం రాకపోకల స్టేటస్​ను తనిఖీ చేసుకోవాలని స్పైస్​జెట్​, ఎయిర్​ ఇండియా సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీచేశాయి.

Also read:-ఇదేం వాన.. ఇదేం వరద..! ఆదిలాబాద్ జిల్లాను ముంచేసింది..

సెంట్రల్, దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు  జలమయం అయ్యాయి. రోడ్లు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.