పలు జిల్లాల్లో కుండపోత వర్షం

పలు జిల్లాల్లో కుండపోత వర్షం

రాష్ట్రంలో పలు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. తెల్లవారు జామున 5గంటలకు మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. సిద్ధిపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. సిద్ధిపేట జిల్లా హబ్సీపూర్ లో 7.2 సెంటీమీటర్ల భారీ వాన పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయాయి. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ లో వర్షానికి వడ్లు తడవకుండా కవర్ కప్పుతుండగా.. పిడుగుపడటంతో పోచయ్య ( 65 ) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న మరో వృద్ధుడికి గాయాలుకాగా.. అతన్ని దుబ్బాక హాస్పిటల్కు తరలించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మోదీని గూడెం గ్రామంలో  పిడుగుపాటుకు గురై పగడాల లింగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు.