నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  •     రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్
  •     జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరికొన్ని రోజులు టెంపరేచర్లు ఇదే స్థా యిలో ఉంటాయని హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ.. పలు చోట్ల రానున్న నాలుగు రోజులపాటు వానలు పడ్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని మంగళవారం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొంది.

బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాతి మూడు రోజులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడొచ్చని పేర్కొంది.

సిటీలో 40డిగ్రీలు దాటిన టెంపరేచర్

రాష్ట్రమంతటా టెంపరేచర్లు 40 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. నిన్నమొన్నటి దాకా పలుచోట్ల 40 డిగ్రీల్లోపే ఉండగా.. ఇప్పుడు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఆ మార్క్​ను దాటేసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్​లో 44.8 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. నిన్నటిదాకా హైదరాబాద్​లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40లోపే ఉండగా.. తాజాగా షేక్​పేటలో అత్యధికంగా 41.5 డిగ్రీలు రికార్డైంది.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్​లో 44.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో 44.6 డిగ్రీలు, రాఘవపేటలో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, జైనథ్​లో 44.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్​లో 44.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.