24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జులై నెల ముగిసిపోతున్నా వానల జాడే కన్పించడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.  అయితే వారికి ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే ఉత్తర భారతంతో పాటు కర్ణాటక, ముంబైలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.  అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షం జాడే లేకుండా పోయింది. అయితే ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినట్టుగా చెప్పారు.