భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,చెరువులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్  నియోజకవర్గంలోని నార్లాపూర్ దగ్గర పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ లో వెళ్లి మహిళా ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ముక్కిడిగుండం, నార్లాపూర్  చుట్టూ గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది.  

జోగులాంబ గద్వాల జిల్లా..

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్  నియోజకవర్గంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అయిజ పట్టణం దగ్గరలోని పెద్దవాగు పొంగిపారడంతో తుపత్రాల,మేడికొండ, పులికల్,చిన్న తాండ్రాపాడు, వేణిసొంపురం, కేశవరం గ్రామాలకు రకాపోకలు బంద్ అయ్యాయి.  ఇటిక్యాల మండలంలోని సాతర్ల,వావిలాల, మానవపాడు మండలంలోని అమరావయి, ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. 702 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఐట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పరిసర గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.