
- పలు జిల్లాల్లో భారీ.. కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిసే చాన్స్
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- దక్షిణ జిల్లాలు చల్లగా.. ఉత్తర జిల్లాలు కొంచెం వేడి
- ఆదిలాబాద్‌లో 42 డిగ్రీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, జనగామ, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లో వచ్చే రెండు రోజుల పాటు మబ్బులు పట్టి ఉంటుందని, సాయంత్రం పూట మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.
దక్షిణ జిల్లాలు కూల్ కూల్
రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు కొంచెం ఎక్కువగా నమోదు కాగా.. దక్షిణాది జిల్లాలు కూల్‌కూల్ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో అత్యధికంగా 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 41.2, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 41, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా వనపర్తి జిల్లా మదనాపూర్లో 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 32.1, నారాయణపేట జిల్లాలో 32.5, వికారాబాద్ జిల్లాలో 33.4, నాగర్‌కర్నూల్ జిల్లాలో 34.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డ్ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్‌లో 37.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉప్పల్, చంపాపేటల్లో 38.3 డిగ్రీలు రికార్డైంది.
పలు జిల్లాల్లో భారీ వర్షం
రుతుపవనాలు రాష్ట్రంలో యాక్టివ్‌గా కదులుతున్నాయని, ఒకట్రెండు ప్రాంతాలు మినహా రాష్ట్రమంతా విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. వాటి ప్రభావంతో సిద్దిపేట, భువనగిరి జిల్లాలు జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో 6.6, మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో 6.6, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6.1, ఇస్లాంపూర్‌లో 5.9, శంకరంపేటలో 5.1, మేడ్చల్‌లో 5, నిర్మల్ జిల్లా బీరవెల్లిలో 4.7, సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో 4.6, నాగర్‌కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 4.4, నిజామాబాద్ జిల్లా చిన్నమావండిలో 3.9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో కాప్రాలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో 3.5, కుషాయిగూడలో 2.4, లాలాపేటలో 2.3, బండ్లగూడలో 2.3, చిల్కానగర్‌లో 2.2, రామంతాపూర్‌లో 2.2, ఏఎస్ రావు నగర్ 2, నాచారంలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధి వరకు జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్‌ను విస్తరించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. వానలు, వరదలు వచ్చినా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా ఓఆర్ఆర్ వరకు తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం సీఎస్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో శాంతి కుమారి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్ట పరుస్తున్నామన్నారు. ఇందుకోసం సిబ్బందిని, యంత్ర పరికరాలను పెంచనున్నట్టు వివరించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 30 టీమ్స్ పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 టీమ్స్ ఏర్పాటు చేసి వీటి సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్ ఫైర్ ప్రివెన్షన్ కు ప్రత్యేక శిక్షణ తోకూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి కుమారి సూచించారు.
కాగా, హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక లోకేషన్లలో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పౌరులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయాలనిఆదేశించారు.