కర్నాటకలో కుండపోత.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన భారీ వానలు

కర్నాటకలో కుండపోత.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన భారీ వానలు

బెంగళూరు/ముంబై/ఢిల్లీ: కర్నాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. వాన నీటితో వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత జిల్లాలైన ఉడుపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్  ప్రకటించారు. 

చిక్​మగళూరు, కొడగు, శివమొగ్గ జిల్లాలకు అరెంజ్  అలర్ట్  జారీ చేయగా.. బెళగావి, హవేరి, కలబురగి, విజయపుర, హాసన్  జిల్లాలకు యెల్లో అలర్ట్  జారీ చేశారు. భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో కరెంటు సరఫరాకు నిలిచి పోయింది. ఉడుపి జిల్లా బైందూరులోని అరిషినగుడి జలపాతం చూసేందుకు వచ్చిన ఓ టూరిస్టు.. కొండ అంచున నిలబడి వీడియో తీస్తుండగా జారి కిందపడి కొట్టుకుపోయాడు.

దక్షిణ కన్నడ, ఉడుపిలో డేంజర్​గా నదులు

దక్షిణ కన్నడ (డీకే), ఉడుపి జిల్లాల్లో రికాం లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నేత్రావతి, ఫల్గుణి నదుల ఒడ్డున నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కుక్కె సబ్రమణ్యస్వామి గుడి వద్ద కుమారధార నది డేంజర్  లెవల్​ను దాటి ప్రవహిస్తున్నది. వర్షాలు తగ్గే వరకు ఆలయ సందర్శనకు రావొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ముంబైలోనూ జోరుగా వానలు

ముంబైలోనూ సోమవారం జోరుగా వానలు కురిశాయి. సిటీతో పాటు ఈస్టర్న్, వెస్టర్న్  సబర్బ్ లలో గత 24 గంటల్లో వరుసగా 5.8, 6.9, 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా భారీ వానలు కొనసాగే అవకాశ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే యెల్లో అలర్ట్  జారీ చేశారు. 

ఇంకా డేంజర్ లెవల్​లోనే యమున

ఢిల్లీలోని యమునా నది కొద్దిగా శాంతించింది. ఆదివారం నీటిమట్టం 206.7 మీటర్లకు చేరుకో గా.. సోమవారం 205.33 మీటర్లకు తగ్గింది. అయినా డేంజర్  లెవల్​లోనే ప్రవహిస్తున్నది.