పెరిగిన వర్షాల జోరు

పెరిగిన వర్షాల జోరు
  • చాలా జిల్లాల్లో భారీ వర్షాలు
  • రంగారెడ్డి జిల్లా సంగంలో 16 సెంటీమీటర్ల వాన

హైదరాబాద్​, మహబూబ్‌‌నగర్‌‌‌‌/ నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ వెలుగు: రాష్ట్రంలో వాన కుమ్మేసింది. చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, గాలులతో వానలు దంచికొట్టాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వర్షాల జోరు పెరిగింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టీఎస్​డీపీఎప్​ డేటా ప్రకారం మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు రంగారెడ్డి జిల్లాలోని సంగంలో 16 సెంటీమీటర్లు, మహబూబ్​నగర్​లోని ఉడిత్యాల్​లో 15.6, నాగర్​కర్నూల్​లోని తోటపల్లిలో 13.6, ఆమన్​గల్​లో 12.6, వనపర్తిలో 12.5, నల్గొండలోని డిండిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురువారం పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, యాదాద్రి భువనగిరి, నాగర్​కర్నూల్​లలో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం

మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్​ జిల్లాల్లో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగాయి. దుందుభి వాగు పారింది. పాలమూరు పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పెద్దవాగు పొంగడంతో  సూరారం–-ఉడిత్యాల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతిఘన్​​పూర్​ సమీపంలో పాటు కాల్వల నుంచి వచ్చిన నీరు కల్వర్టు ఎక్కి పారాయి. దీంతో ఉదయం 5 గంటలకు జడ్చర్ల నుంచి షాద్​నగర్​కు వెళ్తున్న కారు కొట్టుకుపోయింది. ఓ చెట్టును తాకి అక్కడే ఆగడంతో, అందులో ఇద్దరు కారు తలుపులు తీసుకొని బయటపడ్డారు. జడ్చర్లలో  కొన్ని కాలనీల్లోకి నీళ్లు చేరాయి. నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లా తాడూరు మండలంలోని పలు స్కూళ్లు చెరువుల్లా మారాయి.