దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

దేశవ్యాప్తంగా  విస్తారంగా వర్షాలు

దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. నైరుతి రుత పవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో నదులు, చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గుజరాత్ లో పడిన భీకర వర్షం పడటంతో అహ్మదాబాద్ లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

మరోవైపు కర్ణాటకలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కర్ణాటకలోని అన్ని జలాశయాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో హవేరిలోని మదగ్ మసూర్ చెరువు ఉదృతంగా ప్రవహిస్తోంది. 9. 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు కర్ణాటకలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కన్నడ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చర్యలు చేపట్టాయి. చండీగర్ లో కూడా భారీ వర్షం పడుతోంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.


మహారాష్ట్రలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజుల నుంచి వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. ఇవాళ ఈదురు గాలులతో పాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలు, సముద్రాలు, చెరువులు దగ్గరకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.