జోరు వాన, పొంగుతున్న వాగులు, వంకలు

జోరు వాన, పొంగుతున్న వాగులు, వంకలు
  • గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద
  • పలుచోట్ల నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
  • హైదరాబాద్​లో మూడు రోజులుగా ముసురు
  • ఏజెన్సీ ఏరియాల్లో నిలిచిపోయిన రాకపోకలు
  • భద్రాచలం, పర్ణశాల వద్ద షాపులు మూత
  • నిలిచిపోయిన 1.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • ఏడు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్


నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్​ సహా మిగిలిన చోట్ల ముసురు పట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుతుండడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ సిటీలో నాలాలు పొంగి పొర్లి సాయిగణేశ్​ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్ఆర్​ నగర్ జలమయమయ్యాయి. భద్రాచలం–పేరూరు మార్గంలో నల్లబెల్లి గ్రామం వద్ద భారీ చెట్టు నేలకొరిగి, కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల, వేములవాడ పట్ణణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ రోడ్ పై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. కామారెడ్డి జిల్లా లింగంపేట, గాంధారి మధ్య రామలక్ష్మణ్​పల్లి మత్తడివాగు బ్రిడ్జి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వరదలో కొట్టుకుపోయింది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. రామలక్ష్మణ్​పల్లి గ్రామానికి చెందిన 60 మంది స్టూడెంట్లు స్కూలుకు వెళ్లలేకపోయారు. ఎడతెరిపిలేని వానలతో కోల్​బెల్ట్​ వ్యాప్తంగా ఓసీ గనుల్లో దాదాపు 1.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, దాదాపు 22.53 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​ బర్డెన్​ పనులు ఆగిపోయాయి. 
ఉప్పొంగుతున్న వాగులు 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ఏడుమెలికల వాగు, కిన్నెరసాని కలిసే చోట చప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట నక్క వాగు ఉప్పొంగింది. ములుగు జిల్లా తిప్పాపురం అలుబాక రోడ్డు మీదుగా పెంక వాగు ప్రవహిస్తుండడంతో తిప్పాపురం, కలిపాక, పెంక వాగు, సీతారాంపురం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొండ్రాయిగూడెం గ్రామానికి రాక పోకలు స్తంభించాయి.  
గోదావరికి పెరిగిన వరద 
భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి వచ్చే వరదలతో బుధవారం రాత్రికి 35 అడుగులకు నీటి మట్టం చేరుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అలా తెలిపారు. గోదావరి వరదలపై బుధవారం ఆఫీసర్లతో కలెక్టర్​ రివ్యూ చేశారు. రాబోయే 24 గంటల పాటు గోదావరికి వరద పోటు ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో కలెక్టర్​ పర్యటించి లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. గ్రామాల్లోకి నీరొస్తే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. సాయంత్రం 5 గంటలకే 32 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి పొంగడంలో భద్రాచలం, పర్ణశాల స్నానఘట్టాల వద్ద షాపులు మూతపడ్డాయి. కాళేశ్వరం నుంచి 2.35 లక్షలు, ఇంద్రావతి నది నుంచి 2.15లక్షలు, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 60 వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరికి వస్తున్నది.  ఆసిఫాబాద్​ జిల్లాలోని ప్రాణహిత నది ఉప్పొంగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కౌటల మండలం తుమ్మిడిహెట్టి , చింతలమనేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నది. 

ALSO READ : గుజరాత్​, మహారాష్ట్రలో.. కుండపోత వాన


బొగత జలపాతం వద్దకు నో ఎంట్రీ 
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్దకు తాత్కాలికంగా పర్యాటకులను అనుమతించడంలేదని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ తెలిపారు. చత్తీస్​గఢ్​,- తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బొగత జలపాతం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నది. ఆసిఫాబాద్​ జిల్లాలోని జలపాతాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. తిర్యాణి నుంచి 16 కి.మీ. దూరంలో ఉన్న పంగిడిమదరా జలపాతం గుట్టలపైనుంచి జాలువారుతూ కనువిందు చేస్తున్నది.

దుమ్ముగూడెంలో  16.5 సెంటీమీటర్లు
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 16.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మణుగూరులో 14.3, అశ్వాపురంలో 12. 2 చర్లలో 9. 1, భద్రాచలంలో 5.3, మెదక్​లో 5.9, హవేలి ఘన్​పూర్​లో 5.8,  సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో 4.7, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 6.6, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


గర్భిణులను వాగు దాటించిన పోలీసులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని వరద ప్రాంతాలలో పోలీసులు రెండు రోజులుగా సహాయ చర్యలు చేపడుతున్నారు. ఎలిషెట్టిపల్లి గ్రామానికి చెందిన దబ్బకట్ల సునీత, చేరుకల శ్రీమతి అనే గర్భిణులు బుధవారం జంపన్న వాగు దాటలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని పోలీస్ డిజాస్టర్, రెస్క్యూ టీం అత్యాధునిక రబ్బర్ బోట్ సాయంతో వారిని వాగు దాటించి ఏటూరునాగారం కమ్యూనిటీ హాస్పిటల్ కు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న ఏఎస్పీ సంకీర్త్, సీఐ రాజు, ఎస్​ఐ కృష్ణప్రసాద్, పోలీస్ డిజాస్టర్ రెస్క్యూ టీం ను ఎస్పీ గాష్​ ఆలం అభినందించారు.

మరో 4 రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను ఇచ్చింది. మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్​ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.