
- గ్రామాలు, టౌన్లను ముంచెత్తిన వరదలు
- గిర్ జిల్లాలో 14 గంటల్లోనే 34 సెం.మీ. వాన
- జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌లోనూ వర్షాలు
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/ముంబై: ఉత్తరాదిలో మళ్లీ కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్‌లోని 3 జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. మహారాష్ట్రలోనూ కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో యమునా నది మళ్లీ డేంజర్ మార్క్ దాటింది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
గిర్‌లో 24 గంటల్లో 54 సెంటీమీటర్లు
గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతంలోని అనేక గ్రామాలు, టౌన్లు నీట మునగడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధులన్నీ చెరువులను తలపిస్తూ వరద నీరు ప్రవహిస్తుండటం, కార్లు, బైకులు నీటిలో తేలుతూ కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజ్ కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో కొన్ని గంటల్లోనే 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా గిర్ సోమనాథ్ జిల్లా సూత్రపడ తాలుకాలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు14 గంటల్లోనే 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం సమయానికి గడిచిన 24 గంటల్లో గిర్ సోమనాథ్ జిల్లాలోని సూత్రపడలో 54.1, వెరావల్ లో 48.1, తలాజాలో 29.9 సెంటీమీటర్ల వర్షం పడిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని 43 రిజర్వాయర్లు డేంజర్ లెవల్‌కు చేరాయన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు.
యమునలో మళ్లీ పెరిగిన నీటిమట్టం
ఢిల్లీలో యమునా నది నీటిమట్టం బుధవారం ఉదయం మళ్లీ డేంజర్ మార్క్ దాటింది. మంగళవారం డేంజర్ మార్క్ కన్నా తక్కువగా నీటి మట్టం నమోదైందని, కానీ మరునాడు ఉదయం 8 గంటలకల్లా 205.48 మీటర్లకు చేరిందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. సాయంత్రం కల్లా ఇది 205.72 మీటర్లకు చేరవచ్చని తెలిపింది. కాగా, ఢిల్లీలో బుధవారం మోస్తరు వర్షాలు కురిశాయి.
జమ్మూకాశ్మీర్‌లో ఏడుగురు మృతి
జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లా, బనీ తెహసిల్ లో బుధవారం భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకుని ఉండొచ్చని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరో రెండు చోట్ల కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో ఒక్కొక్కరు చనిపోయారని వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా కథువా, సాంబా జిల్లాల్లో నదులు డేంజర్ మార్క్ దాటుతున్నాయని, దోడా, కిష్టావర్ జిల్లాల్లోనూ ఎక్కడ చూసినా వరదలాంటి పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. వైష్ణోదేవి యాత్ర మాత్రం సజావుగా సాగుతోందన్నారు. హెలికాప్టర్ సర్వీసులు కూడా నిలిపేశామని చెప్పారు. కాగా, జమ్మూకాశ్మీర్ లో రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండీ హెచ్చరించింది.
ALSO READ :జోరు వాన, పొంగుతున్న వాగులు, వంకలు
కొంకణ్‌లో భారీ వర్షాలు
మహారాష్ట్రలోని కొంకణ్ జిల్లాల్లో బుధవారం వర్షాలు దంచికొట్టాయి. ముంబై సబర్బన్ సహా థానే, పాల్ఘర్, రత్నగిరి, రాయగఢ్ జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. భివాండిలో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో 250 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాల్ఘర్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు. థానేలో గడిచిన 24 గంటల్లో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని ఉల్లాస్, అంబా, సావిత్రి, పాతాళగంగ వంటి నదులు ఉప్పొంగుతున్నాయి. పాల్ఘర్ జిల్లాలోని వసాయి, పాల్ఘర్, దహాను, తలసారి తాలుకాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.
ముంబై సమీపంలో ట్రాకులు నీట మునగడంతో కల్యాణ్- కాసర సెక్షన్లో పలు రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాలు కురవడంతో ఉద్యోగులు త్వరగా ఇండ్లకు చేరుకోవాలని సీఎం షిండే ట్వీట్ చేశారు. వశిష్ఠి నది ఉప్పొంగుతోందని, చిప్లున్ టౌన్‌లోని లోతట్టు ప్రాంతాల వారిని రీలొకేట్ చేయాలని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధికారులను ఆదేశించారు.