ఇంకా భారీ వర్షాలు కురుస్తాయి

ఇంకా భారీ వర్షాలు కురుస్తాయి
  • అధికారులంతా అప్రమత్తంగా ఉండాలె : కేసీఆర్
  • గోదావరి ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉంది 
  • ముంపు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశం 
  • వర్షాలు, వరదలపై సీఎం రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల కంటే, ఈసారి ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులను సీఎం కేసీఆర్ హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందని చెప్పారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్​ను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్​లో వర్షాలు, వరదలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఏయే జిల్లాల్లో ఎంత మేర వర్షపాతం నమోదైంది? నది పరీవాహక ప్రాంతాల్లో ఏ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది? తదితర అంశాలపై సమీక్ష చేశారు. గోదావరి తీర ప్రాంతాల్లోని మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ‘‘గోదావరి, దాని ఉప నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  ఏర్పాట్లు చేయాలి. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్ష సమయం. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలి” అని డీజీపీని కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్​లో పరిస్థితి ఎట్లుంది? 

హైదరాబాద్​లో పరిస్థితిపై జీహెచ్ఎంసీ అధికారులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వరద నీటి కాల్వలు, చెరువులు, రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. భద్రాచలం ముంపు ప్రాంతాల్లో హెల్త్ సిబ్బంది బాగా పని చేశారని మంత్రి హరీశ్ రావు, ఆరోగ్య శాఖ అధికారులను అభినందించారు. డెంగీ ఐదేండ్లకోసారి సైకిల్ గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే అరికట్టాలని సూచించారు. దెబ్బతిన్న నేషనల్ హైవేలను రిపేర్ చేస్తున్నామని సీఎంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.

ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. 

గోదావరిలో ప్రవాహం, ప్రాజెక్టుల పరిస్థితిపై కేసీఆర్ కు నీటి పారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సారెస్పీ, కడెం నుంచి వస్తున్న వరద, గంటగంటకు వరదలో వచ్చే మార్పులను శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసే విధానాన్ని ఇరిగేషన్ స్పెషల్​ సీఎస్ రజత్ కుమార్ వివరించారు. వరదను ముందుగానే అంచనా వేస్తే, ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేయొచ్చని చెప్పారు. అయితే వాతావరణ శాఖ వరదలను అంచనా వేయలేకపోతున్నదని, ఈ టెక్నాలజీతో వరద ముప్పును అంచనా వేయొచ్చని తెలిపారు. 

సెలవులు తీసుకోకండి: సీఎస్ సోమేశ్​ 

భారీ వర్షాల నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆది, సోమవారాల్లో సెలవులు ఉన్నప్ప టికీ, అధికారులెవరూ తీసుకోవద్దని.. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండాయని.. గండ్లు పడకుండా జాగ్రత్త పడాలన్నారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలె

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి తెలిసేలా, దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాడవాడలా జాతీయ జెండా ఎగురవేయాలని, క్రీడలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7 రోజులు ‘భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహం’ నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరేయాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన 1.20 కోట్ల జెండాల తయారీకి ఏర్పాట్లు చేయాలన్నారు. గద్వాల, నారాయణ పేట్, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులు, వాహనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, ప్రధాన కూడళ్లు, రోడ్లపై జెండా ఎగురవేయాలన్నారు.