SECUNDERABAD BONALU: లష్కర్ బోనాలకు పటిష్ట బందోబస్తు..2,500 మంది పోలీసులు, 40కి పైగా సీసీ కెమెరాలతో నిఘా

SECUNDERABAD  BONALU: లష్కర్ బోనాలకు పటిష్ట బందోబస్తు..2,500 మంది పోలీసులు, 40కి పైగా సీసీ కెమెరాలతో నిఘా
  • శివసత్తులు, జోగినీలకు మధ్యాహ్నం -3 గంటల మధ్య అమ్మవారి దర్శనం
  • బోనంతో వచ్చే మహిళలకు 2 ప్రత్యేక క్యూలైన్లు
  • బోనంతోపాటు ఇంకో ఐదుగురికి అనుమతి
  • ప్రెస్​మీట్​లో నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

పద్మారావునగర్, వెలుగు: ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర కోసం 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. దేవాలయ ఆవరణలో ఉత్సవ కమిటీతోపాటు నిర్వాహకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శివసత్తులు, జోగినీలు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.

 బాటా జంక్షన్ నుంచి నేరుగా టెంపుల్​వరకు తమ సాంప్రదాయాల ప్రకారం రావచ్చన్నారు. మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేయగా, బోనంతో వచ్చే మహిళలకు 2 ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. బోనంతో వచ్చే మహిళతోపాటు ఇంకో ఐదుగురిని అనుమతిస్తామన్నారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయన్నారు. దేవాలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో 40కి పైగా సీసీ కెమెరాలు, పోలీస్ స్టేషన్​లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణి, ఈవో గుత్తా మనోహన్ రెడ్డి, ఏసీపీ సైదయ్య, ఇన్స్పెక్టర్లు పరశురాం, నర్సింగరావు పాల్గొన్నారు.

రెండ్రోజులు వైన్​ షాపులు బంద్

లష్కర్ బోనాల  నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీ కమిషనరేట్ ఐదు పోలీస్ డివిజన్లలోని (గాంధీనగర్, చిలకలగూడ, బేగంపేట, గోపాలపురం, మహంకాళి) 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్లు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీ ఆదేశాలతో గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాం గేట్, మారేడ్​పల్లి, మహంకాళి, రాంగోపాల్ పేట, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం షాపులు రెండ్రోజులు మూతపడనున్నాయి.