రోడ్లపై భారీగా నిలిచిన నీరు.. ప్రజల ఇబ్బందులు

రోడ్లపై భారీగా నిలిచిన నీరు.. ప్రజల  ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలతో బైంసాలోని ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వానలతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్, మండలంలోని కప్పలవాగు, రాళ్లవాగు చెక్ డ్యాంలపై నుంచి నీరు పారుతోంది. తీగలవాగు చెక్ డ్యాంపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండలంలోని తుంగిన గ్రామ చెరువుకట్ట తెగిపోవడంతో కింద ఉన్న 150 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భీంగల్ మండలం గోనుగొప్పులలో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో దర్పల్లి, బీంగల్ కి రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండలం  లింగాపూర్ గ్రామంలో  తుంగిని మాటు  కాలువకు గండి పడింది.  దీంతో పంటపొలాలకు  నీరు చేరుతోంది. తాడ్వాయి మండలం  బ్రాహ్మణపల్లిలో వాగు  ఉధృతంగా ప్రవహిస్తుంది.  బ్రాహ్మణపల్లి, టేక్రియాల్, చందాపూర్ , కాలోజివాడి, సంగోజివాడి, తాడ్వాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టరేట్ లో కంట్రో ల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నవారు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. 


కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మద్నూర్, జుక్కల్, కామారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. అటు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం 39 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో జిల్లా కలెక్టరేట్ లో, మున్సిపల్ కార్పొరేషన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 

ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భారీగా వరద నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. వాగుల పై నుంచి నీరు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలోని రవీంద్రాపూర్ కాలనీ నీటమునిగింది. దీంతో కాలనీ వాసులను తెప్పల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.  భారీ వర్షాలతో బైంసాలోని ప్రధాన రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దారులన్నీ జలయమయం కావడంతో..జనం ఇండ్ల నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది.

నిర్మల్ బస్టాండ్ లోకి వర్షం నీరు భారీగా చేరింది. బస్టాండ్ లోని క్యాంటీన్లు , దుకాణాల్లోకి వరద నీరు  చేరింది. ప్రయాణీకులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జిల్లాలోని కిష్టాపూర్-అవర్గ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అర్లీ ఎక్స్ రోడ్- లోకేశ్వరం మధ్య బైక్ లు, కార్లలో రావద్దని పోలీసులు సూచించారు. మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూర్ మండలం, సుద్దాల గ్రామం దగ్గర సుద్దాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు తెలిపారు. భారీ వర్షాలకు  శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కల్యాణి ఖని, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, ఇందారం ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరింది. దీంతో రోడ్డలన్ని బురదమయం అయ్యాయి. 75 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 

కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ లోని  అనేక కాలనీల్లో  జనం బయటకు రాలేని  పరిస్థితి ఏర్పడింది . భగత్ నగర్, కట్టారాంపూర్  ఏరియా, విద్యానగర్, మంకమ్మతోట, పోలీస్  ట్రైనింగ్ కాలేజీ  ఏరియాల్లో భారీగా  వరద నీరు  చేరింది. మున్సిపల్  కార్పోరేషన్ ఏరియాలో చాలా  చోట్ల  డ్రైనేజీలు పూర్తి  కాకపోవడంతో  ప్రజలు అవస్థలు  పడుతున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడ హన్మజిపేట దగ్గర నక్క వాగు  పొంగిపోర్లుతుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలతో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లల్ని నదులు వాగుల దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ప్రమాదకర  పరిస్థితులు  ఏర్పడితే వెంటనే  డైల్ 100 కు సమాచారం అందించాలన్నారు.