నేపాల్‌లో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

నేపాల్‌లో భారీ వర్షాలు.. ఏడుగురు మృతి

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో.. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. పర్వతాలపై మంచు కరగడంతో టిబెట్ సరిహద్దులోని సింధుపాల్ చౌక్ జిల్లాలో వరద పోటెత్తింది. ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో నీటి మట్టం పెరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరిని పునారావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నారు. వరదలతో ఏడుగురు చనిపోగా.. మరో 20 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీయులున్నారు. వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిందని సింధుపాల్ చౌక్ వార్డు చైర్మన్ రుద్రప్రసాద్ దులాల్ తెలిపారు.

సింధుపాల్ చౌక్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోను వరదలు బీభత్సం సృష్టించాయి. స్తంభాలు నేలకూలడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరద ప్రాంతాల్లో నేపాల్ పోలీసులు మరియు సైనికులు.. సహాయక, పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. వర్షాలకు మేలమ్చి పట్టణంలో రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. ఆ ప్రాంతంలోని 200కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దాంతో వందలాది మంది నిరాశ్రయులవడంతో.. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. నేపాల్‌లోని వర్షాల ప్రభావం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పడింది. బీహార్‌లోని గండక్ నదిలో క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది.