
బుధవారం ( జులై 30 ) సాయంత్రం కాసేపు కురిసిన వర్షానికే హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సిటీలో వర్షం పడితే.. ట్రాఫిక్ జామ్ అవ్వడం మాములు విషయమే కానీ.. మరీ కొద్దిసేపటి వర్షానికే ఈ రేంజ్ లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు వాహనదారులు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అందులోను సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇవాళ కురిసిన కొద్దిపాటి వర్షానికే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఐకియా నుంచి మైండ్ స్పేస్ మార్గంలో హైటెక్ సిటీ KPHB మార్గంలో వాహనాలు బారులు తీరాయి.
మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలతో పాటు లింగంపల్లి లాంటి ఏరియాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. ఐకియా ఫ్లైఓవర్ పై నుంచి కేబుల్ బ్రిడ్జి మార్గంలో, గచ్చిబౌలి, కోండాపుర్, ఏరియాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో వర్షం పడిందంటే చాలు బైక్ పైనో..కారులోనే రోడ్డెక్కాలంటే జనాలు వణికిపోతారు. రోడ్లపై నిలిచే నీటితో గంటలకు గంటలు రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ కావడమే దీనికి కారణం. రెండువారాల కిందట శుక్రవారం స్కూల్స్, ఆఫీసులు వదిలే సమయంలో వాన దంచి కొట్టడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి రోడ్లు బ్లాక్ అయిపోయాయి.
హైదరాబాద్ లో వర్షం పడితే.. ఈ రూట్ లో మాత్రం అస్సలు వెళ్ళకండి భయ్యా.. ట్రాఫిక్ జామ్ కాదు నరకమే.. pic.twitter.com/sjtUDw3EZF
— Manohar Reddy (@ManoharRed18542) July 30, 2025
దీంతో ఈ సమస్యపై హైడ్రా, బల్దియా కమిషనర్లతో పాటు ట్రాఫిక్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. చిన్నపాటి వాన పడిన కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో మళ్లీ రిపీట్ కాకుండా యాక్షన్ప్లాన్చేపట్టారు. ముందుగా ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడిన ప్రాంతాలపై మూడు శాఖల అధికారులు ఫోకస్ పెట్టారు. ఫ్లైఓవర్లపై నీళ్లు నిలవడానికి కారణాలేంటని ఆరా తీశారు. ఫ్లైఓవర్ల పై నుంచి నీళ్లు సాఫీగా వెళ్లే గ్రిల్స్ లో మట్టి, చెత్త పేరుకుపోవడంతోనే సమస్య ఏర్పడిందని గుర్తించి క్లియర్ చేయించే పనులు మొదలుపెట్టారు. గ్రేటర్ లోని మొత్తం 70 ఫ్లైఓవర్లపై క్లీనింగ్ పనులను హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మొదలుపెట్టాయి.
అలాగే, గ్రేటర్ లోని141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా స్టాటిక్ టీమ్స్ తో పాటు ట్రాఫిక్, బల్దియా, వాటర్ బోర్డు సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ప్రతి శాఖ నుంచి ఒక్కొక్కరి చొప్పున 141 ప్రాంతాల్లో సిబ్బంది వర్షం పడినప్పుడు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటారు. రోడ్లపై చేరే నీటిని వెంట వెంటనే మోటర్ల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తారు