విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, చింతల్ కుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, మణికొండ, పుప్పాల్ గూడా, నార్సింగి, హిమాయత్ సాగర్, బండ్లగూడ జాగీర్, కిస్మాత్పురా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, తార్నాక, ఓయూ, అంబర్ పేట్లోనూ భారీగా వర్షం పడుతోంది.

విజయవాడ జాతీయ రహదారిపై  హయత్ నగర్ నుంచి భాగ్యలత, జింకల పార్క్ , వనస్థలిపురం పనామా చౌరస్తాల్లో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది. అటు చింతల్ కుంట వద్ద రోడ్డుపై నడుములోతు వర్షపు నీరు చేరింది. దీంతో భాగ్యలత నుంచి పనామా వరకు అటు ఎల్బీ నగర్ నగర్ నుంచి చింతలకుంట వరకు భారీగా ట్రాఫిక్ జాం అయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒకవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.