పొదుపు సంఘాల్లో అక్రమాలకు SHG యాప్ తో చెక్

పొదుపు సంఘాల్లో అక్రమాలకు SHG యాప్ తో చెక్

పొదుపు సంఘాల్లో గతంలో అనేక అక్రమాలు జరిగాయి. సభ్యులు నెలవారీగా డబ్బులు చెల్లించినా బ్యాంకులో జమకాకపోయేవి. ఆ పరిస్థితికి చెక్ పెట్టేలా SHG  యాప్ తీసుకొచ్చారు. దీని ద్వారా సభ్యులు ఎప్పటికప్పుడు తమ లావాదేవీల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. 

ఇప్పటివరకు పొదుపు సంఘాల లావాదేవీలు తెలుసుకోవాలంటే నెలవారి నివేదిక పుస్తకాలు, వీఏవో, సీసీల ట్యాబ్ , కంప్యూటర్ లో  లాగిన్  అవ్వాల్సి  ఉండేది. పొదుపు సంఘాల లెక్కలు,చేతి రాత అర్థం కాక కొందరు సభ్యులు, అధికారులు ఇబ్బందులు పడేవారు.లెక్కలు పక్కగా ఉండటం కోసం  2015 లో ప్రతీ  గ్రామైక్య సంఘానికి 15 వేల విలువ చేసే ట్యాబ్ ను ఇచ్చారు. ఇందులో  సంఘం పరిధిలోని లావాదేవీలను నెల వారిగా నివేదికల ఆధారంగా ఎంట్రీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇందులో  వీఏవోలకు మాత్రమే లాగినయ్యే అవకాశం ఉంది. 

పొదుపు సంఘాల బలోపేతానికి ఉపయోగపడేలా సెర్ప్  ఆధ్వర్యంలో కొత్తగా ఎస్ హెచ్ జీ యాప్ ను తయారు చేశారు. పొదుపు సంఘాల్లో అక్రమాలకు చెక్ పెట్టే విధంగా దీన్ని తయారు చేశారు. సభ్యులందరూ  ఎప్పటికప్పుడు తమ లావాదేవీలను  యాప్  ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ లో  కాకుండా లెక్కలన్నీ మొబైల్ లోనే చూసుకునే విధంగా దీన్ని తయారు చేశారు. యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందంటున్నారు  ఐకేపీ అధికారులు.

వరంగల్  గ్రామీణ జిల్లాలో 15 వేల 168 మహిళా పొదుపు గ్రూపులు ఉన్నాయి. ఇందులో 3006 సంఘాల లావాదేవీలు యాప్ లో నమోదు చేశారు. 20 శాతం   నమోదుతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి  స్థానంలో కొనసాగుతోంది. సాధారణ రుణం, బ్యాంక్  లింకేజీ, స్త్రీనిధి, పీవోపీలు అన్నీ పారదర్శకంగా ఉండేలా సంఘాల పూర్తి సమాచారం యాప్ లో నమోదు చేస్తున్నారు  వీఏవోలు. లావాదేవీల నమోదు పూర్తయిన సంఘాలకు సంబంధించి ఏప్రిల్ , మే, జూన్  నెలలో నిర్వహించిన సమావేశాలను ఎంట్రీ చేశారు.ఈ యాప్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే...పోదుపు సంఘాల లెక్కలతో పాటుగా డ్వాక్రా గ్రూపు మహిళల సమావేశాలు ఎక్కడ నిర్వహించారు.. ఎంత మంది హాజరయ్యారు... ఇలా అన్ని విషయాలు తెలిసిపోతాయి. జీపీఎస్  ఆధారంగా సమావేశం  ఫొటో క్యాప్చరింగ్ కు అవకాశం ఉంటుంది. 

యాప్ తో ఐకేపీలో పనిచేస్తున్న  వీఏవోలు, సీసీలపై పనిభారం తగ్గనుంది. ఇప్పటి వరకు వీఏవోలు జాతీయ పోర్టల్ లో ప్రతి నెలా వివరాలు నమోదు చేస్తూ వస్తున్నారు. నెలవారి నివేదికల ఆధారంగా సీసీలు వారి లాగిన్  ఐడీ నుంచి రాష్ట్ర పోర్టల్ లో లావాదేవీలను ఎంట్రీ చేస్తున్నారు. అయితే  ఎస్ హెచ్ జీ యాప్ లో వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తే ... సెర్ప్ కు, ఎన్ ఆర్ ఎల్ ఎం రెండింటిలోనూ ఒకేసారి సమాచారం చేరుతుందని అంటున్నారు అధికారులు. ఈ నెలాఖరు నాటికి అన్ని స్వయం సహాయక సంఘాల వివరాలు ఆన్  లైన్  నమోదుకానున్నాయి. యాప్ పనితీరుపై డ్వాక్రా గ్రూపు సభ్యులకు క్లస్టర్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించామంటున్నారు అధికారులు. ఎస్ హెచ్ జీ యాప్ తో ఇకపై లెక్కల్లో తప్పులు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు.