
- డీసీసీ చీఫ్‌లను పట్టించుకోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు
- మున్సి‘పోల్’ సన్నాహక మీటింగ్స్‌లో బయటపడుతున్న విభేదాలు
- పీసీసీకి ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య ఆధిపత్య పోరు, కలహాలు మరింత ముదురుతున్నాయి. నేతలంతా కలసికట్టుగా మున్సిపల్ ఎలక్షన్ల కోసం వ్యూహ రచన చేయాల్సిన సమావేశాల్లోనే తమ మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టుకుంటున్నారు. పీసీసీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలు రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాయి. మున్సిపల్ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా నిర్వహించుకున్న ఈ మీటింగ్ లలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జులు ఎవరికి వారే తమ పెత్తనం చాటుకునేందుకు ప్రయత్నించడంతో వివాదాలు రేకెత్తాయి.
చాలా జిల్లాల్లో అదే పరిస్థితి
ఇటీవల జరిగిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ ఇన్ చార్జి పొన్నం ప్రభాకర్ రాలేదు. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర నేతలు వచ్చారు. ఈ జిల్లాలో పొన్నంకు, డీసీసీ అధ్యక్షుడికి మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మృత్యుంజయం ఒకటిగా, పొన్నం, కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ రాజశేఖర్ మరో గ్రూప్ గా ఉన్నారని అంటున్నారు.
- పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పెత్తనం చలాయిస్తున్నారని, అది డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొంరయ్యకు రుచించడం లేదని ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి విజయరమణారావు, రామగుండం మున్సిపాలిటీ పరిధిలో పార్టీలో కీలకంగా వ్యవహరించే రాజ్ ఠాకూర్ లతోనూ డీసీసీ చీఫ్‌కు విభేదాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ఇద్దరు నేతలు నేరుగా శ్రీధర్‌బాబుతో మాట్లాడి పార్టీ పరమైన పనులు చేసుకుంటారని అంటున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన డీసీసీ సమావేశంలో డీసీసీ చీఫ్ పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారని, దాంతో శ్రీధర్‌బాబు కొంత నొచ్చుకున్నారని చెబుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్ల నాటికి ఈ విభేదాలు భగ్గుమనే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- జగిత్యాల జిల్లా డీసీసీ చీఫ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొంరెడ్డి రాములుకు మధ్య సఖ్యత లేదని.. అటు లోక్‌సభ సెగ్మెంట్ ఇన్చార్జి మధుయాష్కీతోనూ రాములుకు విభేధాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
- ఆదిలాబాద్ డీసీసీ చీఫ్ భార్గవ్ దేశ్ పాండేతో అక్కడి సీనియర్ నేతలు రాంచంద్రారెడ్డికి, గండ్రత్ సుజాతకు పొసగడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు డీసీసీ చీఫ్‌కు చెప్పకుండానే.. తమ అనుచరులకు పదవులు, పనులు చేసిపెడతారని అంటున్నారు.
- ఖమ్మంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి, అక్కడి డీసీసీ చీఫ్ దుర్గా ప్రసాద్ కు పడటం లేదని.. డీసీసీ చీఫ్ ను రేణుక పట్టించుకోరని పార్టీ వర్గాలు అంటున్నాయి.
- మహబూబ్ నగర్ లో డీసీసీ చీఫ్ ఉబేదుల్లా కొత్వాల్ తో ఆ జిల్లా సీనియర్లు మల్లు రవి, సురేందర్ రెడ్డి, ఇబ్రహీం, మధుసూదన్ రెడ్డిలకు ఏమాత్రం పొసగదని పార్టీలో చర్చ సాగుతోంది.