మేడారం జాతరకు హెలీకాప్టర్​ రెడీ

మేడారం జాతరకు హెలీకాప్టర్​ రెడీ
  •     టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 25 వరకు రైడ్​
  •     జాతర చుట్టూ తిప్పితే రూ.4,800
  •     హనుమకొండ నుంచి మేడారానికి రూ.28,999
  •     రేట్లు తగ్గించాలని సంస్థ ప్రతినిధులను కోరుతున్న ఆఫీసర్లు 

వరంగల్‍, వెలుగు : మేడారం సమ్మక్క సారక్క జాతరలో హెలికాప్టర్‍ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర జరగనున్న నేపథ్యంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో బెంగళూర్‍కు చెందిన తుంబి ఏవియేషన్‍ సంస్థ భక్తులకు హెలీకాప్టర్​సేవలను అందించనున్నది. అయితే, గత రెండు జాతరలతో పోలిస్తే ధరలు పెంచడంతో తగ్గించే విషయమై అధికారులు చర్చిస్తున్నారు. 

ఎడ్లబండి నుంచి హెలికాప్టర్‍ వరకు..

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రయాణం మొదట్లో కాలినడకన...ఆ తర్వాత ఎడ్లబండ్లతో సాగింది. ఆపై ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, బెంజ్‍ కార్ల వరకు వచ్చింది. ఈ క్రమంలో 2010లో హెలికాప్టర్‍ సర్వీసులు మొదలయ్యాయి. మొదటగా టర్బో ఏవియేషన్‍ ఆధ్వర్యంలో మామునూర్‍ ఎయిర్‍పోర్టు నుంచి వీటిని నడిపారు. 2018  జాతరకు వచ్చేసరికి మరో రెండు సంస్థలు రంగంలోకి దిగాయి. 2020, 2022  వచ్చేసరికి కరోనా కారణంగా ఒకే సంస్థ ముందుకొచ్చింది. ఈసారి కూడా ఒకే హెలికాప్టర్‍ ద్వారా సేవలు అందించనున్నారు.  

హెలికాప్టర్‍ జర్నీ.. వీవీఐపీ దర్శనం

టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఏవియేషన్‍ సంస్థ మేడారం అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్‍ సేవలు అందించనుంది. ఇందులో ప్రధానంగా జాయ్‍ రైడ్‍ పేరుతో జాతర జరిగే ప్రాంతం మీదుగా  6 నుంచి 7 నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్కనుంచి మొదలయ్యే రైడ్‍ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాలమీదుగా ఉంటుంది. దీనికోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 ఛార్జీ వసూలు చేయనున్నారు.

 ఇక షటిల్‍ సర్వీస్‍ పేరుతో హనుమకొండ నుంచి మేడారం జాతరకు మరో జర్నీ ఉంటుంది. హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే అవ కాశం ఉండగా.. ఒక్కొక్కరికి రానుపోను రూ.28,999 తీసుకుంటారు. ఇందులో భాగంగా స్పెషల్‍ పాస్‍ ఇస్తారు. దీంతో అమ్మవారి గద్దెల వద్ద వీవీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం సుబేదారిలోని ఆర్ట్స్​అండ్‍ సైన్స్​కాలేజీ గ్రౌండ్‍ లేదంటే కాజీపేట ఫాతిమానగర్‍లోని సెయింట్‍ గాబ్రియల్‍ స్కూల్‍ గ్రౌండ్‍ వేదికలను పరిశీలిస్తున్నారు.     

ప్రతి జాతరలో.. పెరుగుతున్న ఛార్జీలు 

ప్రతి జాతరలో హెలికాప్టర్‍ ధరలు పెరుగుతున్నాయి. 2020లో చార్టర్‍ సర్వీస్‍ పేరుతో హైదరాబాద్‍ లోని బేగంపేట ఎయిర్​పోర్ట్​నుంచి మేడారం జాతరకు సేవలందించగా.. ఒక్కొక్కరి నుంచి రానుపోను రూ.29,999,  హన్మకొండ నుంచి మేడారానికి 12,999 తీసుకున్నారు. జాతరలో అందుబాటులో ఉండే జాయ్‍ రైడ్‍కు రూ.2,999 ధర పెట్టారు. 2022 వచ్చేసరికి హైదరాబాద్‍ సర్వీస్‍ కాకుండా కేవలం హనుమకొండ నుంచి మాత్రమే రైడ్​పెట్టారు. దీనికి గాను ఒక్కొక్కరికి రూ.19,999 టికెట్​పెట్టారు. జాతరలో ఏరియల్‍ వ్యూ, జాయ్‍ రైడ్‍ కోసం రూ.3700 ధర నిర్ణయించారు. 

ప్రస్తుత జాతరలో ధరలను మరింత పెంచింది. హనుమకొండ నుంచి రూ.28,999, మేడారం లోకల్‍ జాయ్‍ రైడ్‍ అయితే రూ.4800 రేట్లతో అధికారులకు వారం కింద కొటేషన్‍ ఇచ్చింది. పెరిగిన హెలికాప్టర్‍ ఫ్యూయల్‍ ధరల వల్లే తాము రేట్లు పెంచామని తుంబి ఏయిర్‍వేస్‍ ప్రతినిధులు చెబుతుండగా.. పెరిగిన ధరలు భక్తులకు ఇబ్బంది కలిగేలా ఉన్నాయని కలెక్టర్‍ ఆధ్వర్యంలోని టూరిజం అధికారులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. 21 నుంచి 25 వరకు సేవలు ఓకే చేసినప్పటికీ పెంచిన ధరల్లో ఎంతోకొంత తగ్గించేలా జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.