హెల్మెట్లు అందిస్తరు.. రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తరు

హెల్మెట్లు అందిస్తరు.. రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తరు

హైదరాబాద్, వెలుగు:  సిటీ రోడ్ల మీద ట్రాఫిక్‌‌లో బైక్‌‌లు నడపడం సవాల్‌‌తో కూడుకున్న పని. ఏదో ఒక రకంగా యాక్సిడెంట్​కు గురై బైకర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఇలా చనిపోతున్నవారిలో ఎక్కువగా హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారే. ఈ నేపథ్యంలోనే హెల్మెట్ల వాడకంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తితో పాటు పిలియన్ రైడర్(వెనుక కూర్చునే వ్యక్తి)కి కూడా కచ్చితంగా హెల్మెట్ ఉండాలని ట్రాఫిక్ డిపార్ట్​మెంట్ అధికారులు సూచిస్తున్నారు. రోడ్ సేఫ్టీ మీద పనిచేసే ఎన్జీవోలు సైతం ఇదే బాటపట్టారు. బస్తీలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి హెల్మెట్ వాడకంపై అవగాహన క్యాంపెయిన్ లు నిర్వహిస్తున్నాయి. హెల్మెట్లు కూడా పంచుతున్నాయి.

వీడియోలు, ఫొటోలు చూపిస్తూ..

హెల్మెట్ వాడటం ఎంత ముఖ్యమో తెలిపేలా ఎన్జీవోలు స్కూళ్లలో ‘రైడ్ టు రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ క్యాంపెయిన్‌‌’లు నిర్వహిస్తున్నారు. 3 నుంచి 8వ తరగతి స్టూడెంట్లకు వర్క్‌‌షాప్‌‌ కండక్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ముందుగా స్కూళ్లను ఎంచుకుని స్టూడెంట్ల ఐడీ, పేరెంట్ ఆర్‌‌‌‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ తో రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఒక రోజు స్కూళ్లోనే అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రొజెక్టర్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలను చూపిస్తూ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలను వివరిస్తున్నారు. ‘హెల్మెట్ ఫ్యామిలీ- ..హెల్దీ ఫ్యామిలీ’ కొటేషన్లతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాంపెయిన్‌‌లో పాల్గొన్న పేరెంట్లకు, స్టూడెంట్లకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేస్తున్నారు.

7500 హెల్మెట్లు పంపిణీ చేశాం..

ఏడేండ్లుగా దేశవ్యాప్తంగా రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నం. గతేడాది తెలంగాణాలో ప్రారంభించాం. గతేడాది 5 వేల ప్రభుత్వ స్కూళ్లలో ఈ అవేర్ నెస్ కార్యక్రమాలు చేశాం. ఈ ఏడాది ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లను ఎంచుకున్నాం. ఇప్పటివరకు 7,500ల హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశాం.

ఆరాధన, ప్రాజెక్ట్ హెడ్, ట్రాక్స్ ఎస్ సొసైటీ రోడ్ సేఫ్టీ ఎన్జీవో