
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలకు దగ్గరవడానికి నాయకులు పాట్లు పడుతున్నారు. కొందరు రోడ్ పక్కన ఉండే టీ షాప్ లలో చాయ్ అమ్ముతుండగా.. మరికొందరూ మిరపకాయ బజ్జీలు వేస్తూ జనాలను పలకరిస్తున్నారు. ఇందులో భాగంగా.. బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమామాలిని కూడా ట్రాక్టర్ నడుపుతూ.. గడ్డికోస్తూ ప్రజలను పలకరించింది.
యూపీ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి హేమామాలిని పోటీ చేస్తున్నారు. శుక్రవారం ప్రచారంలో పాల్గొన్న ఆమె రైతులతో ముచ్చటించారు. నియోజకవర్గ ప్రజలకు దగ్గరవడానికి హేమమాలిని ప్రయత్నిస్తున్నారు. ప్రచారంలో బాగంగా.. నిన్న గడ్డి కోసిన ఆమె ఈ రోజు ట్రాక్టర్ నడిపారు. 2014 సాధారణ ఎన్నికలలో కూడా ఆమె ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు.