వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో అమలుకు ఆదేశాలు

వైద్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సిన్.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో అమలుకు ఆదేశాలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ గవర్నమెంట్  హాస్పిటళ్లలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి హెపటైటిస్  బి వ్యాక్సిన్  ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెపటైటిస్  బి వైరస్  వల్ల వ్యాపించే వ్యాధి కావడంతో హాస్పిటళ్లలో పేషెంట్లకు ట్రీట్​మెంట్  చేస్తున్న క్రమంలో వైద్య సిబ్బంది దీని బారిన పడుతున్నట్లు సర్కార్​ గుర్తించింది. ఇలా ఇప్పటికే చాలా మంది ఈ వ్యాధి సోకి ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. 

దీంతో ముందు జాగ్రత్తగా హెపటైటిస్  బిని కంట్రోల్  చేయడానికి వైద్య సిబ్బందికి వ్యాక్సిన్  ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఫస్ట్  ఫేస్ లో 18 జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్  ఇవ్వనున్నారు. ఈ జాబితాలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. 

ముందుగా జిల్లా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్  సెంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని హెల్త్  ఫ్యామిలీ వెల్ఫేర్  కమిషనర్  ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత పీహెచ్ సీలు, సబ్  సెంటర్ల సిబ్బందికి ఇవ్వనున్నారు. మంచిర్యాల జిల్లాలో ఫస్ట్  ఫేస్ లో 1,590 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. వారికి ఈ నెల 8, 9, 10 తేదీల్లో వాక్సినేషన్  షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, ఇంకా వ్యాక్సిన్లు రాలేదని తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం.