అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉంది

అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉంది

త్రివిక్రమ్‌‌తో పని చేసిన ప్రతిసారీ విజయాన్నే అందుకున్నారు అల్లు అర్జున్. మూడోసారీ అదే మ్యాజిక్ రిపీటవ్వుద్ది అంటున్నారు. ‘అల వైకుంఠపురములో’ నేడు విడుదలవుతున్న నేపథ్యంలో బన్నీ ఇలా ముచ్చటించారు. గ్యాప్ తీసుకున్నప్పుడు చిన్నవే అయినా చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటాం. నేనూ తెలుసుకున్నా. ఇక లైఫ్‌‌లో ఎప్పుడూ గ్యాప్ రాకుండా చూసుకోవడానికి ఈ గ్యాప్ ఉపయోగపడింది. ఆ సమయంలో అభిమానుల సపోర్ట్ మర్చిపోలేను. అందుకే అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ఆర్మీ ఉంది అన్నాను. ప్రీ రిలీజ్‌‌లో నేను ఎమోషనల్ అవడానికి సినిమా స్క్రిప్ట్‌‌కి సంబంధం లేదు. మన కల్చర్‌‌‌‌లో తండ్రీకొడుకుల మధ్య ఒక తెలియని మొహమాటం ఉంటుంది. ఇప్పటివరకూ ఇరవై సినిమాలు చేస్తే అందులో ఏడెనిమిది నాన్నతోనే చేశాను కానీ ఎప్పుడూ ఆయనకి థ్యాంక్స్ చెప్పలేదు. ఆయన నాకు లెక్కలేనన్ని చేశారు. మంచి సందర్భంలో చెబుదామనుకున్నాను కానీ అంత ఎమోషనల్ అవుతానని ఊహించలేదు.

గీతాఆర్ట్స్ బ్యానర్‌‌‌‌లో ‘సోనూ కే టీటూ కీ స్వీటీ’ రీమేక్ చేద్దామనుకున్నారు. చాలామంది అది నాకేమో అనుకున్నారు. నేను కూడా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. కానీ అప్పటికే త్రివిక్రమ్ ఈ కథ చెప్పారు. దానికంటే ఈ కథే నాకు బెస్ట్‌‌ అనిపించింది. సాఫ్ట్‌‌వేర్ కంపెనీలో పనిచేసే మధ్య తరగతి కుర్రాడి పాత్ర నాది. పూజాహెగ్డే నాకు బాస్‌‌. నా ఫాదర్‌‌‌‌గా మురళీశర్మ నటించారు. ఆయనకీ నాకు అస్సలు పడదు. ఓ వైపు మిడిల్ క్లాస్ ఇల్లు. మరోవైపు వైకుంఠపురం అనే పెద్ద ఇల్లు. ఆ ఇంటికి మాకు ఉన్న కనెక్షన్ ఏమిటనేదే సినిమా. నాది ఎంటర్‌‌‌‌టైనింగ్ క్యారెక్టర్ కనుక నేనేదో సీరియస్ మూడ్‌‌లో ఉండి షాట్ రెడీ అనగానే సరదాగా చేసి వెళ్లిపోతే అది బాగా రాదు. అందుకే వ్యక్తిగతంగా కూడా సరదా  మూడ్‌‌లో ఉండి చేశాను. త్రివిక్రమ్​, నేను చేసిన ‘జులాయి’లో చాలా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఉంది.

‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఎమోషన్ డామినేట్ అయ్యి ఎంటర్‌‌‌‌టైన్మెంట్ తగ్గింది. అందుకే మళ్లీ సినిమా చేసేటప్పుడు వినోదం ఎక్కువ ఉన్న సినిమా చేయాలని అప్పుడే అనుకున్నాం. అనుకోకుండా నా గత మూడు చిత్రాలు సరైనోడు, డీజే, నా పేరు సూర్య సీరియస్ సినిమాలు అయ్యాయి. అందుకే మా ఇద్దరి మధ్య చర్చల్లో గతంలో ఆయన చెప్పిన ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఇలాంటి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ నేనెప్పుడూ చేయలేదు. సహజంగా ఈ జానర్‌‌‌‌లో యాక్షన్ కుదరదు. కానీ ఇందులో కుదిరింది. చిరంజీవి గారికి సంబంధించిన కొన్ని హైలైట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. అవేమిటో తెరపైనే చూడాలి. ఆయన ఇంకా సినిమా చూడలేదు. ఇవాళ మధ్యాహ్నం చూస్తారు. కొందరు హీరోలు, దర్శకుల మధ్య ఒక రిథమ్ కుదురుతుంది. చిరంజీవి గారు, కోదండ రామిరెడ్డి గారు కలిసి అప్పట్లో అనేక హిట్ మూవీస్ చేశారు. అలా ఇప్పుడు త్రివిక్రమ్ గారికి నాకు మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఆ కంఫర్ట్ ఉంది కనుకే మూడు సినిమాలు చేయగలిగాం. కొందరు ఫిల్మ్ మేకర్స్ మన బలాన్ని ఉపయోగించుకుంటే.. ఇంకొందరు మనకి కొత్త బలాన్నిస్తారు. త్రివిక్రమ్  మనల్ని మనం గొప్పగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే వ్యక్తి. మన వ్యక్తిగత జీవితంలో మార్పు తీసు కొస్తే ఆటోమేటిక్‌‌గా మన వృత్తి జీవితంలోనూ మార్పు వస్తుంది. పర్ఫార్మెన్స్ మారడం అంటే ఒక యాక్టర్ లైఫ్‌‌లో పర్సనల్ లైఫ్ మారడం.

సంక్రాంతి పోటీ కొత్తగా వచ్చింది కాదు. దశాబ్దాలుగా ఉంది. ఏ ఫిల్మ్ మేకర్ అయినా సోలో రిలీజ్ కోరుకుంటాడు. అంతకుమించిన వసూళ్లు ఈ సీజన్‌‌లో వస్తాయి కనుక ఇతర చిత్రాలు వస్తున్నా సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకుంటారు. అందుకే పోటీ ఏర్పడుతుంది. తెలుగు కమర్షియల్ సినిమాలను ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. దాంతో శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ వల్ల మన తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరిగింది. కేవలం తెలుగు ప్రేక్షకులు చూస్తే డిజిటల్‌‌లో ఇన్ని వ్యూస్ రావు. నాన్ తెలుగు ఆడియెన్స్ వల్లే ఇది సాధ్యమవుతోంది.  కొన్ని సినిమాలు థియేటర్ కంటే శాటిలైట్‌‌లో బాగా వర్కవుటవుతాయి. బద్రీనాథ్ యావరేజ్ సినిమా. శాటిలైట్‌‌లో సూపర్ హిట్. థియేటర్‌‌‌‌లో చూసిన సినిమా కనుక బాగోలేని సీన్స్ తీసేసి రిలీజ్ చేస్తారు. వాళ్లకు ఆ అడ్వాంటేజ్ ఉంది. మలయాళంలో స్ట్రెయిట్ సినిమా చేసే ఆలోచన ఉంది. కొన్ని కథలు విన్నాను కానీ స్క్రిప్ట్ కుదరలేదు. చేస్తే కచ్చితంగా మంచి సినిమానే చేయాలి. లేదంటే మన తెలుగు పరువు పోతుంది.