హీరో ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేయనున్న మహీంద్రా గ్రూప్
V6 Velugu Posted on Jan 20, 2022
న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్ బైక్‌లను మహీంద్రా గ్రూప్ తయారు చేయనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ పెరగడంతో మధ్యప్రదేశ్‌లోని మహింద్రా గ్రూప్ ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేయనున్నారు. దీనికి సంబంధించి హీరో ఎలక్ట్రిక్, మహీంద్రా గ్రూప్‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. హీరో ఎలక్ట్రిక్ తీసుకొచ్చిన పాపులర్ మోడల్ ఆప్టిమా, ఎన్‌వైఎక్స్ టూవీలర్లను మహీంద్రా తయారు చేయనుంది. ఈ భాగస్వామ్యంతో పాటు లుథియానాలోని ప్లాంట్‌ను విస్తరిస్తుండడంతో ఈ ఏడాది 10 లక్షల ఈవీలను తయారుచేయడానికి హీరోకి వీలుంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో మరింతగా విస్తరించేందుకు హీరో ఎలక్ట్రిక్ మహీంద్రా గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుందని కంపెనీ ఎండీ నవీన్ ముంజల్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ త్రీవీలర్, ఫోర్ వీలర్లను తీసుకురావడంలో మహీంద్రా గ్రూప్ ముందుందని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్‌ను చేరుకోవడానికి రెండు లీడింగ్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. మహీంద్రా గ్రూప్‌కు ఉన్న విస్తారమైన సప్లయ్ చెయిన్‌తో కొత్త మార్కెట్‌లకు చేరుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ లాంగ్‌టెర్మ్ పార్టనర్‌షిప్‌తో ఈవీ టెక్నాలజీని పంచుకోవడానికి వీలుంటుందని ముంజల్ పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్‌కు చెందిన యూరప్ కంపెనీ పజ్యోట్‌కు ఈవీలను పీతంపూర్ ప్లాంట్ (మధ్యప్రదేశ్) లోనే తయారు చేస్తున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేషన్ జెజురికర్ అన్నారు. ఈ ప్లాంట్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ కలిసి ఉంటుందని చెప్పారు. ఈ పార్టనర్‌షిప్ వలన ఇరు కంపెనీలు లాభపడతాయని అభిప్రాయపడ్డారు.
Tagged Electric Vehicle, Hero Electric, Mahindra collaborate in EV Electric