నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా.. ఆసక్తి రేకెత్తిస్తున్న 'SVCLLP x నిఖిల్' పోస్టర్!.

నిఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమా.. ఆసక్తి రేకెత్తిస్తున్న 'SVCLLP x నిఖిల్'  పోస్టర్!.

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కు సంబంధించిన కొత్త ప్రాజెక్టు ప్రకటన సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు తాత్కాలికంగా  ‘SVCLLP x నిఖిల్’ అనే పేరును ఖరారు చేశారు.  ఇప్పటికే 'కుబేరా' మూవీ విజయంతో దూసుకుపోతున్న శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ ఈ చిత్రాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని  సోషల్ మీడియా వేదికగా తెలిపింది.  ఈ సినిమా ప్రకటనతో పాటు విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

హై-కాన్సెప్ట్ పోస్టర్
లేటెస్ట్ గా విడుదలైన ఈ పోస్టర్ ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని సూచిస్తోంది. ఈ పోస్టర్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించినట్లుగా కనిపిస్తోంది. కూల్ బ్లూ షేడ్స్‌లో ఉన్న పోస్టర్‌లో ఓ సిల్హౌటెడ్ ఫిగర్, అంటే నిఖిల్, గాలిలో నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అతని వెనుక ఒక ప్రకాశవంతమైన వృత్తాకార రింగ్ ఉంది. ఇది సినిమా ఒక వినూత్నమైన, సైన్స్ ఫిక్షన్ లేదా ఫాంటసీ కథతో రాబోతోందని సూచిస్తోంది సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం
 ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. నిఖిల్ సినిమా అంటే కంటెంట్ ప్రధానంగా ఉంటుందని ప్రేక్షకులకు తెలుసు. అయితే ఈసారి భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో ఒక సరికొత్త అనుభూతిని అందించబోతున్నారని తెలుస్తోంది. గతంలో 'కార్తికేయ 2' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో నిఖిల్ పాన్ -ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ కొత్త లుక్, పాత్ర డిజైన్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ALSO READ : 'ఓజీ' సునామీ..

వినాయక చవితి పండుగ, నిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. "SVCLLP x నిఖిల్. వినాయక చవితి , సునీల్ నారంగ్ పుట్టినరోజు స్ఫూర్తితో, SVCLLP బ్యానర్ నిఖిల్‌తో కలిసి ఒక లార్జర్-దెన్-లైఫ్ సినిమా అనుభవాన్ని అందించడానికి జట్టుకడుతోంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు 'కుబేరా' దర్శకుడు శేఖర్ కమ్ముల తో కలిసి మరో ప్రాజెక్టు కూడా చేయబోతున్నట్లు వెల్లడించింది.

నికిల్ తో సినిమా ప్రకటన తర్వాత దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, సినిమా పేరు, కథాంశం, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.  నిఖిల్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి చిత్రం కానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.