Pawan Kalyan: 'ఓజీ' సునామీ.. విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు!

Pawan Kalyan: 'ఓజీ' సునామీ..  విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు!

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ' ఓజీ " (They Call Him OG). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది. ఇంకా నెల రోజులు ఉన్నప్పటికీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం నుంచే అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమైయ్యాయి. కేవలం కొన్ని గంటల్లోనే అంచనాలకు మించిన స్పందన లభించింది.
 
అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు
మంగళవారం అమెరికాలోని కొన్ని థియేటర్లలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం కేవలం 46 షోలకే 82,681 డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అది కూడా కేవలం కొద్ది గంటల్లోనే 2,800కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి.  ఇంకా వందల సంఖ్యలో థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ కావాల్సి ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్ చూస్తే, 'ఓజీ' పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అమెరికాలో అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : 'హృదయపూర్వం' మూవీ రివ్యూ..

'హరి హర వీరమల్లు' ను మించిపోతుందా..
గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' అమెరికాలో మిలియన్ డాలర్ల మార్కును మాత్రమే దాటగలిగింది. కానీ 'ఓజీ' మాత్రం రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మొదటి రోజు ప్రదర్శనల నుంచే 'ఓజీ' తెలుగు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ హైప్ ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో 'ఓజీ' ఒక సునామీలా బాక్సాఫీస్‌ను ముంచెత్తడం ఖాయం అంటున్నారు.

 

'ఓజీ' పై అంచనాలు ఎందుకు పెరిగాయి?
'సాహో' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు సుజీత్ ఈ 'ఓజీ' సినిమాను రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్, సుజీత్ స్టైలిష్ మేకింగ్ కలయికలో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో పాటు, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతుండడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఆసక్తిని పెంచుతోంది. విలక్షణ నటుడు అయిన ఇమ్రాన్ హష్మీ పాత్ర సినిమాకు ప్రధాన బలం కానుంది. దక్షిణాదిలో ఆయనకు ఇదే తొలి చిత్రం

ఈ చిత్రాన్ని 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు.  పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అబ్దుల్ మాలిక్ మొదలైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ 'హరి హర వీరమల్లు' మూవీలా కాకుండా  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి మరి.