మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు బెయిల్

న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదంటూ.. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 

మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ తో పాటు జాక్వెలిన్ నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను పలు విధాలుగా విచారించారు. సుఖేశ్ చంద్రశేఖర్ తనకు ఖరీదైన లగ్జరీ కార్లు, నగలతో పాటు లక్షల విలువైన గుస్సీ, షేనెల్ బ్యాగులు, దుస్తులు, బూట్లు ఇచ్చాడని చెప్పింది. తాను ఎక్కడకు వెళ్లాలన్నా ప్రైవేట్ జెట్ విమానాలు, విలాసవంతమైన హోటళ్లలో బస ఏర్పాటు చేసేవాడని ఈడీ అధికారుల ఎదుట అంగీకరించింది. జాక్వెలిన్ వాంగ్మూలం తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పటికే చార్జీషీటు కూడా దాఖలు చేశారు. 

జాక్వెలిన్ వద్ద కావాల్సినంత డబ్బు ఉందని.. కేవలం సరదాల కోసమే ఆమె కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఈడీ తరపున ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. కేసు విచారణ సమయంలో జాక్వెలిన్ ను ఎందుకు అరెస్టు చేయలేదని.. కేవలం లుక్ ఔట్ నోటీసులు మాత్రమే ఎందుకు జారీ చేశారని కోర్టు ప్రశ్నించింది. మరో నిందితుడు జైలులో ఉండగా.. జాక్వెలిన్ ను ఎందుకు బయటే వదిలేశారని.. నచ్చని వారిని అరెస్టు చేసి.. నచ్చిన వారిని వదిలేస్తున్నారా..? అని ఈడీని కోర్టు నిలదీసింది. 

జాక్వెలిన్ తరపున వాదించిన న్యాయవాది ఈడీ విచారణ ఇప్పటికే ముగిసిందని, చార్జీషీటు కూడా దాఖలు చేయడం పూర్తయిందని తెలిపారు. గత ఆగస్టు 31న ఈడీ సప్లిమెంటరీ చార్జీషీటు దాఖలు చేసిందని, దీంతో ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే.. ఈడీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు..తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదంటూ కండీషన్లతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇన్ని రోజులు మధ్యంతర  బెయిల్ పై ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు  రెగ్యులర్ కండీషన్ బెయిల్ మంజూరు చేసింది.