5 దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు...

5 దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు...

వెండితెరపై నటించి..నర్తించి..ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించిన నటీమణుల్లో ఎల్. విజయలక్ష్మి ఒకరు.  సిపాయి కూతురు సినిమాతో బాలనటిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఎల్. విజయలక్ష్మీ...ఆ తర్వాత జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 50 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఎల్. విజయలక్ష్మీ..ఎన్టీఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమె ఐదు దశాబ్దాల తర్వాత తెలుగు గడ్డపై అడుగుపెడుతున్నారు. తెనాలిలో జరుగుతున్న  ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎల్. విజయలక్ష్మీ హాజరవనున్నారు. 

ప్రతీ నెల ఒకరికి అవార్డు

ఏడాది పాటు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా  ఈ ఉత్సవాల్లో  భాగంగా రోజుకో  సినిమా చొప్పున ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు ఏడాది పాటు పెమ్మ సాని(రామకృష్ణ) థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. ఈ  కార్యక్రమంలో  ప్రతి నెల ఎన్టీఆర్ కుటుంబం  నుండి ఒకరు  పాల్గొంటారు. ప్రతి నెల ఎన్టీఆర్తో పనిచేసిన  ఒక లెజెండరీ యాక్టర్కు అవార్డు, గోల్డ్ మెడల్ ప్రదానం  చేస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలకు గానూ...ఎన్టీఆర్  పురస్కారానికి అలనాటి అందాల నటి ఎల్. విజయ లక్ష్మి ఎంపికయ్యారు. అవార్డు స్వీకరించిన తర్వాత...రామకృష్ణ థియేటర్ లో  జగదేకవీరుని కథ,  రాముడు - భీముడు సినిమాల్లో తనకు నచ్చిన ఒక సినిమాను అభిమానులతో కలసి ఎల్. విజయలక్ష్మీ వీక్షిస్తారు. అటు అమెరికాలో స్థిరపడిన ఎల్. విజయ లక్ష్మి ఎన్టీఆర్ అవార్డు స్వీకరించేందుకు తెనాలి వస్తుండటంపై అభిమానులు  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్టీఆర్ తో 15 సినిమాల్లో...

లెజండరీ నటుడు ఎన్టీఆర్ తో ఎల్ విజయలక్ష్మీ 15 పైగా చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎల్. విజయలక్ష్మీ చేసిన సినిమాల్లో ఆమె చేసిన నాట్యం విశేష ఆదరణ పొందాయి. ఆ తర్వాత ఎల్. విజయలక్ష్మీని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది నాట్య కళాకారులుగా ఎదిగారు. 

సినిమా నేపథ్యం..

1960వ దశకములోని తెలుగు సినిమా నటి ఎల్.విజయలక్ష్మి. ఈమె భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించారు. నాట్యంపై ఆసక్తితో...ఎల్. విజయలక్ష్మీ కుటుంబం పూణే నుండి చెన్నై తరలి వచ్చింది. అనతికాలంలోనే నాట్యకళాకారిణిగా మారింది. ఈమె నాట్యంతో తొలిసారిగా తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి.

చివరి సినిమా..

1960వ దశకపు చివర్లో వచ్చిన ఈటి వరై ఉరవు ఎల్. విజయలక్ష్మీ చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు, విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లిదండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్ళిచేసుకొని మనీలాలో స్థిరపడింది. మనీలాలో ఖాళీ సమయంలో చేసేదేమి లేక వ్యవసాయశాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించింది. ఆ తర్వాత విజయలక్ష్మి 1991లో అమెరికాలో స్థిరపడి, అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నారు.