అభ్యర్థుల హైటెక్ ​ప్రచారం.. సొంతంగా యాప్​లు తయారు చేయించుకుంటున్న క్యాండిడేట్స్

అభ్యర్థుల హైటెక్ ​ప్రచారం.. సొంతంగా యాప్​లు తయారు చేయించుకుంటున్న క్యాండిడేట్స్
  • ప్రజలను చేరేందుకు సోషల్ ​మీడియాతోపాటు కొత్త వ్యూహాలు
  • వందలమందితో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్​ పెట్టే ఆలోచన
  • లక్షలు ఖర్చు చేసి రూపొందించుకుంటున్న అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్లకు దగ్గరవడానికి అభ్యర్థులు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటిదాకా సోషల్ మీడియానే ప్రధాన ప్రచార అస్ర్తంగా ఎంచుకున్న అభ్యర్థులు, ఇప్పడు ఒక అడుగు ముందుకేసి పర్సనల్​గా యాప్​లను తయారు చేయించుకుంటున్నారు. ఈ యాప్స్ ఇదివరకు పార్టీలకే ఉండేవి, ఇప్పడు అభ్యర్థులు కూడా వీటిని వాడుతున్నారు. యాప్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్న అభ్యర్థులు, దాని ద్వారా తమ సెగ్మెంట్ల ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యాప్​లో అభ్యర్థుల ప్రాథమిక సమాచారంతో పాటు,  నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్​డేట్ చేస్తున్నారు.  ఓటర్ లిస్ట్ ను బూత్ స్థాయి నుంచి అప్​డేట్ చేసి, ప్రతి వంద మందికి ఒక ఇన్​చార్జీని నియమిస్తున్నారు. వీరి ద్వారా ఓటర్ల మనోగతాన్ని అంచనా వేసి, మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

బూత్​స్థాయి నుంచి డేటా..

ఈ యాప్​లను ప్రధానంగా రెండు ఇంటర్​ఫేస్​లతో రూపొందించారు. యూజర్ లాగిన్​లో అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు ఓటర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆప్షన్స్ ఇస్తున్నారు. అభ్యర్థి డైలీ షెడ్యూల్, లైవ్​టీవీలు, బ్లడ్​డొనేషన్ తదితరాలు ఉంటున్నాయి. అడ్మిన్ లాగిన్​లో బూత్​స్థాయి ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని ఆధారంగా ప్రతి బూత్​కు ప్రత్యేకంగా ఇన్​చార్జిని నియమించుకుంటున్నారు. ఇన్​చార్జిలు ఓటర్ల వివరాలు సేకరించి, తమకు అనుకూలంగా ఉండేవారా ? ప్రతికూలంగా ఉండేవారా? అని ఎంక్వేరీలు చేస్తారు.  ఏయే బూత్​లో  ఎక్కువ శాతం మహిళలు, పురుషులు ఎటుపైపు ఉన్నారు? ఎక్కడ నష్టపోయే ప్రమాదం ఉందని ఇన్​చార్జి యాప్​లో అప్​డేట్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను  గుర్తించి తమవైపు తిప్పుకోవడానికి అభ్యర్థులు  ప్రయత్నిస్తున్నారు.

వందల మందితో టెలీకాన్ఫరెన్స్ సౌకర్యం

ఈ యాప్​లో నియోజకవర్గంలోని మండలాలు,  గ్రామాలు, బూత్​ల వారీగా ఓటర్ల వివరాలను అప్​డేట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఓటర్ల ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో అభ్యర్థులు వందల మంది ఓటర్లతో ఒకేసారి టెలీకాన్ఫరెన్స్ మాట్లాడే వీలు ఉంటుంది. అభ్యర్థులు ప్రతీ ఓటరుకు తాము చెప్పాలనుకున్నది టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈజీగా చెప్పేస్తున్నారు. ఈ యాప్​లను రూపొందిస్తున్న ప్రైవేట్ సంస్థలు  భారీ స్థాయిలో చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒక యాప్​నకు సంవత్సరానికి 3 లక్షలు, ఐదేండ్లకు 8 లక్షల దాకా చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే బూత్ స్థాయి నుంచి ఓటర్ల వివరాలు, ఫోన్ నంబర్లు, టెలీకాన్ఫరెన్స్, ప్రభుత్వ స్కీమ్​ అర్హుల వివరాలు తదితర సౌకర్యాలు ఉంటుండటంతో ఖర్చుకు వెనకాడకుండా అభ్యర్థులు తమకు కావాల్సినట్టుగా యాప్​లు తయారు చేయించుకుం టున్నారు. ఉమ్మడి వరంగల్ ​జిల్లా లో ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీ అభ్యర్థులు యాప్​లు తయారు చేయిం చుకొని ప్లేస్టోర్​లో పెట్టారని తెలిసింది.